కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించడానికి ఈ నెల 6 నుండి 14 వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు, ప్రజా చైతన్య యాత్రను, ప్రచార జాతాలు నిర్వహిస్తున్నామని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచార జాత ఏడవ రోజున బుధవారం జమ్మికుంట పట్టణంకు చేరుకుందని, జమ్మికుంటలో ప్రచార ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం చౌరస్తా వద్ద సభ నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. ఈ ప్రచార జాత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివ రావు (MLA Kunamneni ) వచ్చారు.
ఈ సందర్భంగా సాంబశివరావు (MLA Kunamneni) మాట్లాడుతూ .. దేశాన్ని బ్రష్టు పట్టించిన బీజేపీ పాలన నుండి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. అధికారం శాశ్వతమని, తమను ఎవ్వరూ కదిలించలేరని మోదీ సర్కార్ కలలు కంటుందని.. అవి కలలుగానే మిగిలిపోక తప్పదని హెచ్చరించారు. ఇటీవల నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో విద్యార్థులు ఆందోళనల్ని మోదీ చిన్న చూపు చూశాడని ఆరోపించారు.
అయితే ఆ ఉద్యమం భారత దేశ వ్యాప్తంగా తీవ్రరూపం దాల్చుతుందనే సమాచారంతో అదే పిల్లల ముందు పెద్ద తలకాయ తలవంచక తప్పలేదని వ్యాఖ్యానించారు. ఆ ఉద్యమం ఫలితంగా విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాడని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు విద్యార్థులను తాను క్షమించానని ప్రధాని మోదీ అంటుంటే సిగ్గేస్తుందని, ప్రధానినే విద్యార్థులు క్షమించారని అన్నారు.
ఇదే నా బీజేపీ పాలన
రాష్ట్రాలకు హక్కులు లేకుండా కేంద్రం కండక్ట్ చేస్తున్న నీట్ లో లీకేజ్ లు అవుతున్నాయని మండిపడ్డారు. విద్యార్థులు కస్టపడి కోచింగ్ లు తీసుకొని చదివితే దాదాపుగా 20 సార్లు నీట్ పేపర్ లీకేజీ అవుతదా? విద్యార్థుల మేధస్సును దొంగిలిస్తారా? ఇదేనా బీజేపీ పాలన? అని నిలదీశారు. మోదీ , అమిత్ షా ఇద్దరు కలిసి దేశంలో మతోన్మాదం సృష్టిస్తూ, కులం, మతం పేరుతో హిందుత్వాన్ని ముందుపెట్టి జై శ్రీరామ్ అంటూ దేశ ప్రజల భవిష్యత్ ను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో గుండాయిజం,రౌడీయిజం చేస్తున్న నాయకుడు మోదీ, ఉపనాయకుడు అమిత్ షా అని అన్నారు.
వారికి ఆ శ్రీరాముడే శిక్ష విధించే పరిస్థితి..
రాముని పేరు చెప్పి, హిందూమతం ఉన్నంత కాలం మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరని విర్రవీగుతున్న వారికి జై శ్రీరామ్ అంటూ చెప్పి పబ్బం గడుపుకుంటున్న వారికి.. చివరకు ఆ శ్రీరాముడే శిక్ష విధించే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల విరాళాలతో అయోధ్యలో రామమందిరం నిర్మిస్తే అందులో 70 సార్లు దొంగలు పడ్డారని వారిని బయటకు ఎందుకు తీయడం లేదంటే అందులో బీజేపీ నాయకులు ఉన్నారని , కాబట్టి తీయడం లేదన్నారు. దొంగతనం చేసింది బీజేపీ నాయకులు కాదని చెప్పే దమ్ము ఈ నరేంద్ర మోదీ కి ఉందా? అని ప్రశ్నించారు.
కార్మికుల శ్రమను దోచుకుంటూ చాలీ చాలని వేతనాలు ఇస్తూ వారిని అర్ధ బానిసలుగా మారుస్తున్నారని, వారి శ్రమతో సంపాదిస్తే అదానీ, అంబానీ లు లాభాలు కూడగట్టుకుంటున్నారని తెలిపారు. దేశంలోని ఆస్తిలో ,సంపదలో ఎన్నడూ లేని విధంగా వ్యత్యాసం కనబడుతుందని, ప్రజల సొమ్మును,రైతుల కష్టాన్ని దోచుకునే దొంగలు అదానీ,అంబనీలైతే వారికి నాయకుడెవరంటే నరేంద్ర మోదీ అని చెప్పకతప్పదన్నారు.
కేంద్రం గుప్పిట్లోనే అన్ని హక్కులు..
రైతుల పంటలకు మద్దతు ధర ఇచ్చే అధికారం రాష్ట్రాలకు లేదని, కార్మిక చట్టాలను మార్చే అధికారం లేదని, పని గంటలు ఉండేవి వాటిని కూడా మార్చడానికి కేంద్రం తీసుకుందని ఇలా అన్ని రంగాల వారి హక్కులను కేంద్రం గుప్పిట్లో పెట్టుకొని ఆటలాడుతుందని చెప్పారు. అందుకే బీజేపీ పాలనను ప్రభుత్వాన్ని మార్చాలని సీపీఐ దేశ వ్యాప్తంగా పిలుపునిచ్చిందని అన్నారు. సీపీఐ పిలుపునిస్తే మార్పు జరుగుతుందా? అని కొందరంటారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పిలుపునిచ్చింది తామే, మార్పు కు శ్రీకారం చుట్టేది తామేనని వ్యాఖ్యానించారు.
ఎర్రజెండా చూపెట్టే మార్గంలో దేశం నడవాల్సిందేనని స్పష్టం చేశారు. కాళోజీ చెప్పినట్టు ఒక్క సిరా చుక్క లక్ష మెదల్లకు మేత అన్నట్టు, కమ్యూనిస్టులు ఇచ్చే నినాదం దేశం మొత్తాన్ని కదిలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులు లేకుంటే రక్షణ ఉండదని,పేదవారి కోసం,కార్మికుల కోసం పోరాడేది ఎర్రజెండాయేనని అన్నారు.
100 ఏళ్లుగా నిలబడి పోరాడుతున్నది సీపీఐ పార్టీ అని, కష్టజీవుల చెమటతో, రక్తంతో తడిచిన ఈ ఎర్రజెండా మనిషినున్నంత కాలం ఉంటుందని అన్నారు. ఎంతో మంది అమరులు ఉన్న ఈ గడ్డ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, ముక్దుo మొహియుద్దీన్ లాంటి వీరులు ఉన్న ఈ తెలంగాణ త్యాగాలతో పునీతమైందని అన్నారు.పార్టీలు మారితే తాముకూడ మంత్రులు కావచ్చు కానీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఈ సమాజంలో దొంగలను తరిమే హీరోలుగా ఉంటామన్నారు.
ప్రపంచంలో 300 కోట్ల మంది కమ్యూనిస్టు పరిపాలన దేశాల్లో ఉన్నారని, ఈ దేశంలో కూడా కొన్ని కోట్ల మంది ఎర్రజెండా కింద కమ్యూనిస్టులు గా ఉన్నారని తెలిపారు. నేడు దేశంలో పిల్లలు రోడ్డుమీదుకొచ్చారని, తాము తాము వీధుల్లోకి వచ్చామని.. దేశంలో మార్పు తధ్యమని, కేంద్రం అనుసరిస్తున్న విధానాల మూలంగా బీజేపీ పాలన అంతం కాక తప్పదని సాంబశివ రావు (MLA Kunamneni) పేర్కొన్నారు.
ఈ జాతాలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాస్ రావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, కరీంనగర్, హన్మకొండ జిల్లాల కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, కర్రె భిక్షపతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, పొనగంటి కేదారి, మండల కార్యదర్శి గజ్జి అయిలయ్య, జాతా కోఆర్డినేటర్ లు గూడెం లక్ష్మీ, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బత్తుల బాబు, పిట్టల సమ్మయ్య, న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచన్న యాదవ్, బీర్ల పద్మ, కొట్టె అంజలి, బండ రాజిరెడ్డి, పైడిపల్లి రాజు, వీణవంక, ఇల్లందకుంట మండల కార్యదర్శులు ఇజ్జగిరి రాంగోపాల్, మాదారపు రత్నాకర్, ధర్మల రామ్మూర్తి, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రామరపు వెంకటేష్, పోలోజు రంజిత్, వర్కింగ్ ప్రెసిడెంట్ కసిబొజుల సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఎంత కష్టమొచ్చే.. యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కిన రైతు!
Follow Us On: Instagram

