కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో(Nirmal Congress) నామినేటెడ్ పదవుల పంపకం మరోసారి వర్గ విభేదాలను తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. జిల్లాలో మాత్రం అంతర్గత విభేదాలకు ఫుల్‌స్టాప్ పడటం లేదు. తాజాగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) పాలకవర్గాల నామినేటెడ్ పదవుల(Nominated Positions) భర్తీ అంశం పార్టీలో కొత్త పంచాయతీకి దారితీసింది.
ఇప్పటికే రెండు వర్గాలుగా ఉన్న పార్టీ నేతల మధ్య మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి ఎంట్రీ కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిర్మల్ జిల్లాలో నిర్మల్, ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఖానాపూర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ ప్రాతినిధ్యం వహిస్తుండగా.. నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికార పార్టీని బలోపేతం చేసేందుకు నియోజకవర్గ ఇన్‌చార్జిలను నియమించినప్పటికీ.. సీనియర్ నేతల మధ్య సమన్వయ లోపం పదవుల పంపకంలో కొత్త సమస్యలకు కారణమవుతోందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ముధోల్‌లో ముదిరిన వర్గ విభేదాలు
ముధోల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని పలు మండలాలలో నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు ఏదో ఒక వర్గానికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పార్టీ నేతలు అంటున్నారు. బాసర ఆలయ కమిటీ పాలకవర్గం ఏర్పాటు విషయంలోనూ గత కొంతకాలంగా నెలకొన్న విభేదాలు ఇంకా పరిష్కారం కాలేదని కాంగ్రెస్ వర్గాలలో చర్చ ఉంది. ఇటీవల మండల, జిల్లా కమిటీల నియామకాలలో ఇరు వర్గాలకు చెందిన నేతలు తమ అనుచరులకు పదవులు దక్కించుకున్నారు. ఇప్పుడు నామినేటెడ్ పదవుల విషయంలోనూ అదే తరహా పోటీ నెలకొంది.
వేణుగోపాల చారి ఎంట్రీతో కొత్త సమీకరణాలు
ఉమ్మడి జిల్లా రాజకీయాలలో కీలకంగా వ్యవహరించిన మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి కాంగ్రెస్‌లో చేరడంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనే చర్చ మొదలైంది. నామినేటెడ్ పదవుల విషయంలో తన వర్గీయులకు కూడా ప్రాధాన్యం కల్పించాలని ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పటివరకు ప్రధానంగా రెండు వర్గాల మధ్య సాగిన పదవుల పంచాయతీ.. మూడు వర్గాల మధ్య పోటీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిర్మల్‌లో శ్రీహరి రావు–ఐకే రెడ్డి వర్గాల పోటీ
నిర్మల్ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వర్గాల మధ్య రాజకీయ విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత శ్రీహరి రావు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ కేడర్‌ను సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి తన రాజకీయ అనుభవం, పరిచయాలతో తన అనుచరులకు పార్టీ పదవులు ఇప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా, మండల స్థాయి పార్టీ పదవుల నియామకాలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు ఎఫ్‌ఏసీఎస్, పీఏసీఎస్ పాలకవర్గాలపై నేతల దృష్టి పడింది. ఈ పదవులలో తమ వర్గీయులకు అవకాశం కల్పించాలని ఆయా నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
పీఏసీ సమావేశంలో నేతల పట్టు
నామినేటెడ్ పదవుల భర్తీపై డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో పీఏసీ సమావేశం నిర్వహించారు. అయితే పదవుల కేటాయింపులో ఎవరికి వారే తమ వర్గీయులకు ప్రాధాన్యం ఇవ్వాలని పట్టుబట్టినట్లు సమాచారం. దీంతో సమావేశంలోనే పదవుల పంపకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి కూడా ప్రత్యక్ష రాజకీయాలలో చురుకుగా వ్యవహరిస్తుండటంతో.. తన వర్గీయులకు కూడా పదవులు ఇవ్వాలని కోరినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పదవులు దక్కకపోతే పార్టీ వీడుతాం!
ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న తమకు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదవులు దక్కకపోతే పార్టీలో కొనసాగడం కష్టమేనని కొందరు సీనియర్ నేతలు సమావేశంలో స్పష్టం చేసినట్లు సమాచారం. పదవుల పంపకంలో తమకు అన్యాయం జరిగితే పార్టీని వీడే ఆలోచన కూడా చేస్తామని కొందరు హెచ్చరించినట్లు పార్టీ (Nirmal Congress) వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అధిష్టానానికి మరో తలనొప్పి
ఒకవైపు జిల్లాలో బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు పార్టీకి నష్టం కలిగించే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పార్టీని ఏకతాటిపైకి తీసుకురావాలని అధిష్టానం సూచిస్తున్నప్పటికీ.. నామినేటెడ్ పదవుల పంపకం విషయంలో నేతల మధ్య పోటీ మరింత ముదురుతోంది. దీంతో నిర్మల్ జిల్లాలో అధికార కాంగ్రెస్‌కు (Nirmal Congress) నామినేటెడ్ పదవుల పంపకం కొత్త తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు.. యశ్వంత్ వర్మ కేసులో కీలక తీర్పు..!
Follow Us On: Instagram

