కలం, దమ్మ పేట: సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యార్థుల భద్రత, పారిశుధ్య నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఖమ్మం (Khammam) జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెల సాంఘిక సంక్షేమ గురుకులంలో హాస్టల్ (Adavimallela Gurukulam Hostel) నిండా ఎలుకలు చేరి, నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థినులను కరిచిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ గురుకులాల్లో పిల్లలను చేర్పించి నిశ్చింతగా ఉందామనుకున్న తల్లిదండ్రులకు ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించగా, హాస్టల్ నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మంగళవారం రాత్రి హాస్టల్ (Adavimallela Gurukulam Hostel) గదుల్లో నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు దాడి చేయడంతో ఆరుగురు విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాయపడిన వారిని గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే లంకాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్‌సీ) తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వైద్యులు వారికి అవసరమైన మందులు అందజేసి పర్యవేక్షిస్తున్నారు.
హాస్టల్‌లో గత కొంతకాలంగా ఎలుకల బెడద తీవ్రంగా ఉందని, రాత్రి వేళల్లో ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రాంగణంలో పారిశుధ్య నిర్వహణ లోపించడం వల్లే గదుల్లోకి ఎలుకలు భారీగా చేరుతున్నాయని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ పిల్లల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి హాస్టల్‌లో పారిశుధ్య పనులను చేపట్టడంతో పాటు ఎలుకల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్
Follow Us On: Sharechat

