కలం, వెబ్ డెస్క్: పేద పిల్లల కలలకు చిరునామాగా, సామాజిక సమానత్వానికి వేదికగా, ఆధునిక విద్యకు కేంద్రాలుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (Young India Schools) విద్యా రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. “అవరోధాలను ఛేదిస్తూ.. భవిష్యత్తును నిర్మిస్తూ” అనే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రాజెక్టు రాబోయే తరాల విద్యా అవకాశాలను మార్చే కీలక కార్యక్రమంగా నిలవనుందని తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా వివరాలను వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 105 సమీకృత గురుకుల పాఠశాలలు (ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్) నిర్మాణం కానున్నాయి. ఒక్కో పాఠశాలకు సుమారు 25 నుంచి 30 ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు, ఒక్కో పాఠశాల నిర్మాణానికి దాదాపు రూ.200 కోట్ల వరకు వ్యయం చేయనున్నారు. ఒక్కో పాఠశాలలో 2,650 మందికి పైగా విద్యార్థులకు విద్య, వసతి కల్పించేలా ప్రణాళిక రూపొందించారు.
5.36 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో భారీ స్థాయిలో మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో పాఠశాలలో సుమారు 5.36 లక్షల చదరపు అడుగుల బిల్ట్‌అప్ ఏరియా ఉండేలా నిర్మాణ ప్రణాళిక రూపొందించారు. విద్యార్థుల విద్యాభ్యాసంతో పాటు వారి సమగ్ర వికాసానికి అవసరమైన ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య..
సంప్రదాయ పాఠశాల భవనాలకు భిన్నంగా.. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు యంగ్ ఇండియా పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, వసతి గృహాలు, భోజన సదుపాయాలు, క్రీడా వసతులు తదితర సౌకర్యాలతో విద్యార్థులకు సమగ్ర విద్యా వాతావరణాన్ని కల్పించనున్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతో పాటు విద్య, క్రీడలు, సాంకేతికత, సృజనాత్మకత వంటి విభాగాల్లో వారికి విస్తృత అవకాశాలు కల్పించడమే ఈ పాఠశాలల ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంటున్నది.
ప్రతి నియోజకవర్గానికి ఒక విద్యా కేంద్రంగా.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో ఈ సమీకృత నివాస పాఠశాలలను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ఈ పాఠశాలలు దోహదపడనున్నాయి.
పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది..
భవనాలు నిర్మించడం మాత్రమే కాకుండా.. పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలన్న సంకల్పంతో ఈ పాఠశాలలను నిర్మిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నది. ఆర్థిక, సామాజిక అంతరాలను అధిగమించి ప్రతిభ ఆధారంగా ఎదిగే అవకాశాలను విద్యార్థులకు కల్పించడమే లక్ష్యంగా పేర్కొంటున్నది.
తెలంగాణ విద్యా మోడల్‌కు ప్రతీకగా.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 105 పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో స్కూల్ 25 నుంచి 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. ఒక్కో పాఠశాలకు సుమారు రూ.200 కోట్ల నిధులు వ్యయం చేస్తారు. వీటికోసం నిర్మాణం కానున్న 5.36 లక్షల చదరపు అడుగుల బిల్ట్‌అప్ ఏరియా, 2,650 మందికి పైగా విద్యార్థులకు వసతి వంటి భారీ స్థాయి లక్ష్యాలతో ఈ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి.

