కలం, వెబ్‌డెస్క్: ఎవరైనా కనిపించకుండా పోయినట్లు సమాచారం అందితే.. వయసు, లింగంతో సంబంధం లేకుండా పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల్లోని ‘వ్యక్తి’ (పర్సన్) అనే పదానికి కేవలం ‘పిల్లలు’ అని మాత్రమే అర్థం చేసుకుంటూ నిర్లక్ష్యం వహిస్తున్న కొన్ని రాష్ట్రాల తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించే రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఓ మిస్సింగ్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
గోల్డెన్ అవర్స్ కీలకం
మిస్సింగ్ ఫిర్యాదు రాగానే, ప్రాథమిక విచారణ చేస్తామనో లేక ఆ వ్యక్తి కోసం మొదట కుటుంబ సభ్యులనే వెతకమనో చెబుతూ పోలీసులు కాలయాపన చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సమాచారం అందిన వెంటనే పోలీస్ యంత్రాంగం అత్యున్నత స్థాయిలో రంగంలోకి దిగాలని ఆదేశించింది. వ్యక్తి తప్పిపోయిన మొదటి కొన్ని గంటలు (గోల్డెన్ అవర్స్) అత్యంత కీలకమని పేర్కొంది. వ్యక్తి ఆచూకీ లభించే వరకు దర్యాప్తును కొనసాగించాలని, ప్రతి కేసులోనూ చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే దేశవ్యాప్తంగా తప్పిపోయిన వ్యక్తుల వివరాలను సంబంధించిన అన్ని పోర్టళ్లలో ఆరు వారాల్లోగా ఇంటిగ్రేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి గడువు విధించింది.
డీప్ ఫేక్‌పై ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్’
ఏఐ టెక్నాలజీతో సృష్టించే డీప్ ఫేక్ ఫొటోలు, ఆన్లైన్ వేధింపులను అరికట్టేందుకు ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజం’ ఏర్పాటును పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్లో మహిళలపై జరుగుతున్న డిజిటల్ దాడులు, రేప్‌లు హత్య బెదిరింపులు, అనుమతి లేకుండా ఏఐ ద్వారా సృష్టించే అసభ్యకర కంటెంట్‌ను నిలువరించడానికి జుడీషియల్ పర్యవేక్షణతో కూడిన వ్యవస్థ ఉండాలని దాఖలైన పిటిషన్‌పై కోర్టు మంగళవారం స్పందించింది. ఇలాంటి సైబర్ నేరాలు పౌరుల ప్రాథమిక హక్కులకు, ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించింది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ, ఐటీ శాఖలకు సూచించింది.

