కలం, స్పోర్ట్స్ : ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల హవా నడుస్తున్నప్పటికీ, వన్డే క్రికెట్ మనుగడకు ఎలాంటి ఢోకా లేదని సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్ (Jonty Rhodes ) స్పష్టం చేశారు. 50 ఓవర్ల ఫార్మాట్ ఇప్పటికీ క్రికెట్ భవిష్యత్తుకు చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రోడ్స్.. ఆధునిక క్రికెట్ పరిణామాలపై ఈ వ్యాఖ్యలు చేశారు. రోడ్స్ తన క్రీడా జీవితంలో సౌతాఫ్రికా తరఫున 245 వన్డేలు ఆడారు. ప్రస్తుతం పలు జట్లకు ఫీల్డింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు.
ప్రారంభంలో టీ20 వల్ల టెస్టు క్రికెట్‌కు ముప్పు వస్తుందని అందరూ భావించారని, కానీ అది నిజం కాలేదని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం కొన్ని టెస్టు మ్యాచ్‌లు కూడా టీ20 తరహాలోనే వేగంగా సాగుతున్నాయని అన్నారు. అయితే, రాబోయే రోజుల్లో వన్డే ఫార్మాట్ కొంత సవాలును ఎదుర్కొనే అవకాశం ఉందని రోడ్స్ అభిప్రాయపడ్డారు. పొట్టి ఫార్మాట్‌తో పాటు సుదీర్ఘ ఫార్మాట్ నుంచి కూడా 50 ఓవర్ల క్రికెట్‌పై ఒత్తిడి ఉంటుందని విశ్లేషించారు.
నయా తరం ప్రేక్షకులు ఆట వైపు వస్తుండటమే దీనికి కారణమని చెప్పారు. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు తగ్గే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. అయినప్పటికీ వన్డేలకు అంకితభావం కలిగిన అభిమానులు ఉన్నారని, వారి మద్దతు ఎప్పుడూ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంత మార్పు వచ్చినా వన్డే క్రికెట్ లేని ఆటను ఊహించుకోవడం కష్టమని రోడ్స్ ముగించారు.

