కలం, వనపర్తి: జిల్లాలో మరుగుదొడ్డి లేని ప్రభుత్వ పాఠశాల ఉండకూడదని కలెక్టర్ ఆదర్శ్ సురభి (Adarsh Surabhi) స్పష్టం చేశారు. పాఠశాలల్లో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్ల పనులన్నింటినీ సెప్టెంబరు 30లోగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా పాఠశాలలో మరుగుదొడ్డి సౌకర్యం లేకుంటే తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, ముఖ్య ప్రణాళిక అధికారి, జడ్పీ సీఈవో, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి, సంక్షేమశాఖ అధికారులతో జిల్లాలో కొనసాగుతున్న నిర్మాణ పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
పనులు ప్రారంభించకపోవడంపై ఆరా
పెబ్బేరు మండలానికి గవర్నర్ నిధుల నుంచి రూ.15 లక్షలు మంజూరైనప్పటికీ అదనపు తరగతి గదుల నిర్మాణం, నాలుగు బోర్ల పనులు ఇంకా ప్రారంభించకపోవడంపై అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరైన వెంకటేశ్వరస్వామి ఆలయ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
53 పంచాయతీ భవనాలు త్వరగా పూర్తి
జిల్లాలో మంజూరైన 133 గ్రామ పంచాయతీ భవనాల్లో ఇంకా పురోగతిలో ఉన్న 53 భవనాల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందిరాశక్తి భవనం పనులను కూడా వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో మంజూరైన 33 ఫుడ్‌గ్రెయిన్ స్టోరేజ్ భవనాలను అక్టోబరు చివరి నాటికి పూర్తి చేయాలని సూచించారు. సహాయ ఇంజినీర్లు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని పరిశీలించాలని, ఫొటోలను తనకు పంపించాలని ఆదేశించారు.
అన్ని నిర్మాణాలపై దృష్టి
అంగన్వాడీ, వీఓ భవనాల నిర్మాణాలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. డీఎంఎఫ్టీ నిధులతో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని, స్థల సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. వి.బి.జి. రామ్‌జీ పథకం ద్వారా జిల్లాలో అత్యధిక పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (లోకల్‌బాడీస్) ఎన్.ఖీమ్య నాయక్, జడ్పీ సీఈవో యాదయ్య, పంచాయతీరాజ్ ఈఈ విజయ్‌కుమార్, పీడీ డీఆర్డీవో ఇన్చార్జి రామ మహేశ్వర్‌రెడ్డి, సీపీఓ హరికృష్ణ, డీడబ్ల్యూఓ సుధారాణి, పంచాయతీరాజ్ డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

