కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) నగరంలోని నాలుగో టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శేషాల మేఘన (30), శేషాల నరేష్ భార్యాభర్తలు. ఇద్దరూ మేఘన తల్లిగారింట్లో ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంతకాలంగా తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.
నాలుగవ టౌన్ ఎస్హెచ్ఓ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం… నరేష్ ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారని అతని మామ మోహన్ తెలిపారని పేర్కొన్నారు. సంఘటన స్థలంలో మేఘన పురుగుల మందు సేవించి ఉండగా, నరేష్ ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే వారిద్దరూ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అయితే సంఘటన స్థలంలో దంపతులు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్ ప్రకారం.. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వారు తెలిపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఫిర్యాదుదారు కూడా భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వారి మృతిపై తనకు ఎలాంటి అనుమానం లేదని తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దంపతుల ఆత్మహత్యతో వారి ఇద్దరి చిన్నారులు అనాథలుగా మారారు.

