కలం, నిర్మల్: నూతన స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ (Nirmal Collector) భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15న రాష్ట్ర ప్రభుత్వం నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్న నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కడ్తాల్ సమీపంలోని సాగర్ కన్వెన్షన్‌లో ఈ నెల 15న నిర్వహించనున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. అలాగే కొంతమంది లబ్ధిదారులను కార్యక్రమానికి ఆహ్వానించాలని తెలిపారు.
ప్రోటోకాల్‌కు అనుగుణంగా సీటింగ్ ఏర్పాట్లు చేయడంతో పాటు సరైన లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎల్ఈడీ తెరను ఏర్పాటు చేయాలని, హాజరయ్యే వారికి ఎప్పటికప్పుడు తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో దేవిదాస్, పౌరసరఫరాల అధికారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

