కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియ (Telangana SIR) సోమవారంతో ముగిసింది. మొత్తం 3.38 కోట్ల ఓటర్లలో ఎన్యూమరేషన్ ఫారాల్లో వివరాలు ఇచ్చిన ఓటర్లు 2.64 కోట్ల మంది ఓటర్లే. ఇంకా 73.53 లక్షల మంది వివరాలు అందలేదు. వీరి పేర్లు ముసాయిదా జాబితాలో చోటుచేసుకునే అవకాశం లేదు. ఆ జాబితాలో పేరు లేదని అర్హులైన ఓటర్లు భావిస్తే ఈఆర్వో (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్)కు గ్రీవెన్స్ రూపంలో దరఖాస్తు చేసుకోవాలి. వెరిఫికేషన్ తర్వాత వీరి పేర్లను చేర్చడంపై క్లారిటీ వస్తుంది.
ఇప్పటివరకు జరిగిన ‘సర్’ ప్రక్రియలో రాష్ట్రం మొత్తం మీద 78.26% మంది ఓటర్ల వివరాలే డిజిటైజ్ అయ్యాయి. మిగిలిన ఓటర్ల వివరాలు ఎలక్షన్ కమిషన్ సిబ్బందికి చేరలేదు. ఇప్పుడు గల్లంతైన 73.53 లక్షల మంది ఓటర్లలో నెల రోజుల గ్రీవెన్స్ పీరియడ్‌లో ఎంత మంది పేర్లు చేరుతాయన్నది కీలకం. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జరిగిన ‘సర్’ ప్రక్రియలో ఇంత తక్కువ స్థాయిలో సక్సెస్ రేటు వచ్చింది తెలంగాణలో మాత్రమే. గతంలో ‘సర్’ జరిగిన రాష్ట్రాల్లో ఇది 90 శాతానికి పైగానే ఉన్నది.
రెండుసార్లు గడువు పొడిగించినా నో యూజ్ :
రాష్ట్రవ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియ (Telangana SIR) జూన్ 25న ప్రారంభమైంది. నెల రోజుల వ్యవధిలో పూర్తయ్యేలా జూలై 24వ తేదీని డెడ్‌లైన్‌గా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు రూపొందించింది. కానీ ఆశించిన స్థాయిలో పూర్తికాలేదు. కేవలం 72.73 శాతం దగ్గరే ఆగిపోయింది. దీంతో ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఈసీ పేర్కొన్నది. అయినా ఆ పది రోజుల్లో 4.82 శాతమే పూర్తయింది. వంద శాతం పూర్తికావాలన్న ఉద్దేశంతో మరో వారం రోజుల గడువు ఇచ్చి ఆగస్టు 10న కంప్లీట్ కావాలని ప్రకటించింది.
మొత్తం ఈ 17 రోజుల వ్యవధిలో 5.53 శాతమే పెరిగింది. ఓటర్ల సంఖ్య రీత్యా చూస్తే మొత్తం తొలి పది రోజుల వ్యవధిలో 16,32,501 మంది ఓటర్ల వివరాలను బీఎల్వో (బూత్ లెవల్ ఆఫీసర్)లు సేకరించగలిగితే, ఆ తర్వాత వారం రోజుల్లో (ఆగస్టు 3 నుంచి 10 వరకు) కేవలం 2,39,878 మంది వివరాలను మాత్రమే సేకరించగలిగారు. రెండు విడతల్లో 17 రోజుల పాటు ఈసీ అవకాశం ఇచ్చినా ఇంకా 73.53 లక్షల మంది ఓటర్లు వారి వివరాలను బీఎల్వోలకు ఇవ్వలేదు. ఇందులో దాదాపు 59% గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వారే.
ఆ మూడు జిల్లాల్లోనే అత్యధికం :
రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియలో ప్రస్తుతానికి వివరాలు ఇవ్వని కారణంగా డ్రాఫ్ట్ ఎలక్టోరల్ లిస్టులో మిస్ అయిన ఓటర్లు మొత్తం 73.53 లక్షల మంది ఉంటే ఇందులో దాదాపు 59% మంది (43,09,646) హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు చెందినవారే. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఆంధ్ర సెటిలర్ ఓటర్లు ఉంటారన్నది పొలిటికల్ పార్టీల అంచనా. రాష్ట్రంలోని ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశామన్నది చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వాదన.
కానీ చాలా ఇండ్లకు రానేలేదని, ఫారాలను ఇవ్వలేదన్నది నగర ఓటర్ల వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా భర్తీ అయిన ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి బీఎల్వోల చేతికి రాకపోవడంతో 73.53 లక్షల మంది పేర్లు డ్రాఫ్ట్ లిస్టులో చోటుచేసుకునే అవకాశం లేదు. వెరిఫికేషన్‌కు తగిన ఆధారాలు లేనందున భర్తీ చేయలేదా?.. లేక అడ్రస్‌లో ఉండడం లేదా?.. లేక మరో చోటికి షిప్ట్ అయ్యారా?.. లేక ఇంతకాలం బోగస్ ఓటర్లుగా ఉన్నవారా?.. చనిపోయినవారూ కొందరు ఉన్నారా?.. ఇవన్నీ గ్రీవెన్స్ కోసం ఈసీ నిర్ణయించిన నెల రోజుల గడువు తర్వాత క్లారిటీ రానున్నది.
ప్రజల నిర్లక్ష్యమా?.. ఈసీ వైఫల్యమా? :
ఇప్పటివరకు ‘సర్’ జరిగిన రాష్ట్రాల్లో సగటున 95 శాతానికి పైగానే ఓటర్ల వివరాలు బీఎల్వోలకు అందితే తెలంగాణలో మాత్రం అది 80 శాతానికి కూడా చేరుకోలేదు. చివరి వారం రోజుల్లో కేవలం 2,39,878 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రమే బీఎల్వోలకు అందాయి. భర్తీ చేసిన ఫారాలను ఇవ్వడంలో ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్నరా?.. లేక బీఎల్వోలు ఇంటింటికి వెళ్ళి సేకరించడంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారా? లేక బీఎల్వోలకు నగరంలోని అడ్రస్‌లను కనుక్కోవడంలో చిక్కులు ఎదుర్కొన్నారా?.. సీఈఓ పర్యవేక్షణలోనే లోపం ఉన్నదా?.. చివరికి ఈ వైఫల్యానికి జవాబుదారీ ఎవరనేది కీలకంగా మారింది. మరోమారు గడువు పొడిగిస్తున్నట్లు ఈసీ నుంచి ఎలాంటి ప్రకటనా లేకపోవడంతో ఇప్పటివరకు జరిగిన ‘సర్’తోనే సరిపెట్టుకోవాల్సి వస్తున్నది. ప్రస్తుతానికి మిస్ అయిన 73.53 లక్షల ఓటర్లలో ఎంతమంది పేర్లు తిరిగి చేరుతాయన్నది ఆసక్తికరం.

