కలం, వెబ్ డెస్క్: అపర కుబేరుడు గౌతమ్ అదానీ (Gautam Adani)పై అమెరికాలో నమోదైన క్రిమినల్ కేసును అక్కడి కోర్ట్ కొట్టేసింది. ఈ తీర్పును స్వాగతిస్తూ అదానీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. “అమెరికా కోర్ట్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంతో వినమ్రంగా స్వాగతిస్తున్నా. ముందు నుంచి న్యాయ ప్రక్రియ మీద పూర్తి విశ్వాసం ఉంది. కష్ట కాలంలో కూడా నిజం, న్యాయం, చట్టబద్ధ పాలనపై విశ్వాసాన్ని కోల్పోలేదు. ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అదానీ కంపెనీ దేశ నిర్మాణానికి అవసరమైన పనులను ఇక మీదట కూడా కొనసాగిస్తూనే ఉంటుంది. భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునేలా పనులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంటాం. ఇదే మా నిబద్దత. జై హింద్” అని పోస్ట్ చేశారు.
లంచాలు ఇచ్చారంటూ..
ఇండియాలోని వివిధ రాష్ట్రాల్లో సౌర విద్యుత్తు ప్రాజెక్టులు పొందేందుకు అదానీ పలువురు నాయకులు, అధికారులకు సుమారు రూ.2 వేల కోట్లు లంచాలు ఇచ్చారనేది ప్రధాన అభియోగం. అమెరికాలోని పెట్టుబడిదారుల నుంచి సేకరించిన బిలియన్ల డాలర్లను ఇందుకోసం వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హిండెన్ బర్గ్ రిపోర్టు కూడా ఈ విషయాన్ని చెప్పడంతో అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ఈ నేపథ్యంలో 2024 నవంబరులో అదానీ, అతడి మేనల్లుడు సాగర్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. అయితే, 2026లో ఈ కేసులో ముందుకెళ్లొద్దని జస్టిస్ డిపార్ట్‌మెంట్ నిర్ణయించింది. దీనిపై అప్పట్లో జడ్జి నికోలస్ వివరణ కోరారు. ప్రభుత్వ సమాధానంపై సంతృప్తి చెందిన జడ్జి.. కేసును పూర్తిగా కొట్టేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.

