కలం, స్పోర్ట్స్: డెన్మార్క్ వేదికగా జరిగిన యూసీఐ పారా సైక్లింగ్ టోర్నీలో భారత రేసర్లు 12 పతకాలతో సంచలనం సృష్టించారు. అర్షద్ షేక్ 6 మెడల్స్‌తో చెలరేగాడు. డెన్మార్క్ వేదికగా జరిగిన అంతర్జాతీయ యూసీఐ పారా సైక్లింగ్ (Para cycling) ట్రాక్ ఈవెంట్‌లో భారత సైక్లిస్టులు సరికొత్త చరిత్ర సృష్టించారు. కష్టతరమైన ట్రాక్‌పై ముగ్గురు యోధులు అద్భుత ప్రతిభ చూపి ఏకంగా 12 పతకాలు కొల్లగొట్టారు. ఇందులో రెండు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఐదు కాంస్యాలు ఉండటం విశేషం. మూడు రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో భారత అథ్లెట్లు అసాధారణ స్థిరత్వంతో రాణించారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారాలింపియన్ అర్షద్ షేక్ ఈ టోర్నీలో భారత్ తరఫున ప్రధాన ఆకర్షణగా నిలిచారు. విభిన్న విభాగాల్లో పోటీపడిన అర్షద్ ఏకంగా ఆరు పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు. అందులో రెండు బంగారు, మూడు వెండి, ఒక కాంస్య పతకం ఉన్నాయి. అటు గుజరాత్‌కు చెందిన 17 ఏళ్ల యంగ్ రైడర్ విశ్వా వసానీ అంతర్జాతీయ స్థాయిలో తన జైత్రయాత్రను కొనసాగించింది. ఈమె 1 కేఎమ్ ఇండివిజువల్ టైమ్ ట్రయల్, స్క్రాచ్ రేస్, 200 మీటర్ల స్ప్రింట్, ఎలిమినేషన్ రేసుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నాలుగు కాంస్య పతకాలను గెలుచుకుంది.
మరోవైపు 16 ఏళ్ల యువ సంచలనం అంశుమాన్ ధుమాల్ అంతర్జాతీయ వేదికపై అరంగేట్రంలోనే అదరగొట్టాడు. పోటీల్లో సత్తా చాటుతూ రెండు రజత పతకాలను సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీ విజయాలు భారత్‌లో పెరుగుతున్న పారా సైక్లింగ్ సత్తాను అంతర్జాతీయంగా చాటిచెప్పాయి. భవిష్యత్తులో మన అథ్లెట్లు మరిన్ని వేదికలపై మెరిసేందుకు ఈ ప్రదర్శన బలమైన పునాదిగా నిలవనుంది.

