కలం, స్పోర్ట్స్: గాయాలతో టీమిండియా సతమతమవుతున్నా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ (Mohammed Shami)కి జట్టు తలుపులు తెరుచుకోవడం లేదు. జస్ప్రీత్ బుమ్రా లేకపోయినా, 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికలు మొదలైనా అజిత్ అగార్కర్ సెలెక్షన్ కమిటీ షమీ పేరును పరిశీలించడం లేదు. మరి ఈ సీనియర్ బౌలర్ భవిష్యత్తు ముగిసినట్లేనా? దీనిపై భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ సంచలన విషయాలు పంచుకున్నారు.
షమీ ఆశలు వదులుకోవద్దు..
భారత జట్టు ఆలోచనలు ప్రస్తుతం వేరేలా ఉన్నాయని జహీర్ ఖాన్ స్పష్టం చేశారు. కానీ, షమీ (Mohammed Shami) ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ముందుకు ఎలా వెళ్లాలనేది ఆటగాడి సొంత నిర్ణయమన్నారు. మ్యాచ్‌లలో ఆడుతూ, మంచి ప్రదర్శన ఇస్తూ అందుబాటులో ఉండటమే ముఖ్యమని తెలిపారు. జట్టు శైలి వేరుగా ఉన్నప్పటికీ, ఒక ఆటగాడిగా తనవంతు కృషి చేస్తూ షమీ మైదానంలో ఆడటమే సరైన పద్ధతి అని వెల్లడించారు.
గాయాలు ఆటలో భాగమే..
జట్టులో పెరుగుతున్న గాయాల సమస్యలపై జహీర్ ఖాన్ స్పందించారు. బుమ్రాతో పాటు వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా లాంటి వాళ్లు ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇవన్నీ ఆటలో సహజమైన భాగమేనని జహీర్ చెప్పారు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నా, సరైన ప్రణాళికలు చాలా అవసరమని వివరించారు. గాయం అసలు కారణం తెలుసుకునే వరకు ముందుకు వెళ్లలేమని, పరిస్థితిని సరిగ్గా నియంత్రించుకోవడమే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. సెలెక్టర్ల నిర్ణయాలు ఎలా ఉన్నా, ఒక ఆటగాడిగా షమీ తన పని తాను చేసుకుపోతున్నారని స్పష్టమవుతోందన్నారు.
Also Read : U20 వరల్డ్ అథ్లెటిక్స్‌లో భారత్ సత్తా.. 3 పతకాలు
Follow Us On : WhatsApp

