కలం, నిర్మల్: పాఠశాలలకు సెలవు కావడంతో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు చెరువులో మునిగి మృతి చెందిన విషాద ఘటన నిర్మల్ (Nirmal) జిల్లా కుబీర్ (Kubeer) మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. ఒకే కాలనీకి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడటంతో నయా ఆబాదిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాలనీకి చెందిన గణేష్ (11), సోఫియాన్ (13) మరో బాలుడితో కలిసి కుబీర్ సమీపంలోని ఎల్లమ్మ చెరువుకు(దోడర్నచెరువు) వెళ్లారు. గణేష్, సోఫియాన్ ఈత కొట్టేందుకు చెరువులోకి దిగగా.. మరో బాలుడు ఒడ్డునే ఉండిపోయాడు.
కొద్దిసేపటికే ఇద్దరు బాలురు నీటిలో మునిగిపోతుండటాన్ని గమనించిన మరో బాలుడు కేకలు వేయడంతో సమీపంలో గేదెలను మేపుతున్న ఓ పశువుల కాపరి వెంటనే చెరువులోకి దిగి గణేష్‌ను బయటకు తీశాడు. అయితే అప్పటికే సోఫియాన్ నీటిలో గల్లంతయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న గణేష్‌ను కుటుంబ సభ్యులు హుటాహుటిన భైంసా(Bhainsa)లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గణేష్ మృతి చెందాడు.
మరోవైపు నీటిలో గల్లంతైన సోఫియాన్ కోసం ఈత వచ్చిన స్థానిక యువకులు గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటి తర్వాత బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు.సమాచారం అందుకున్న భైంసా ఏఎస్పీ సాయికిరణ్, భైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, కుబీర్ ఎస్సై కృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఒకే కాలనీకి చెందిన ఇద్దరు చిన్నారులు చెరువులో మునిగి మృతి చెందడంతో కుబీర్(Kubeer)లో తీవ్ర విషాదం నెలకొంది. చిన్నారుల మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Also Read : తెలంగాణలో ముగిసిన SIR.. వారందరి ఓట్లు ఔట్..!
Follow Us On: Sharechat

