అడవి బిడ్డల అరణ్య రోదన

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: నల్లమలలోని అడవి బిడ్డలకు ప్రభుత్వ పథకాలకు అందడం లేదు. మన్ననూర్ ఐటీడీఏ (Mannanur ITDA)లో సిబ్బంది కొరత కారణంగా చెంచులకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు దక్కడం లేదు. రేషన్ అందక కడుపు నిండడం కష్టంగా మారింది. ఉపాధి హామీ పనులు నడవక ఉపాధి కరువైంది. ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో నిర్వహణ అధ్వానంగా తయారైంది.

అడవి బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ఐటీడీఏ (ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ) చీకట్లో మగ్గుతున్నది. నాగర్‌‌కర్నూల్ జిల్లాలోని మన్ననూర్ ఐటీడీఏ సిబ్బంది కొరతతో సతమతమవుతున్నది. చెంచులకు దక్కాల్సిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించలేక నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ఐటీడీఏకు దాదాపు 545 నాలుగో తరగతి ఉద్యోగుల పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో ప్రస్తుతం 207 మంది మాత్రమే ఉన్నారు. ఏకంగా 338 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే పరిస్థితి ఎంత దారుణంగా అర్థమవుతున్నది.

ఐటీడీఏను నడిపించాల్సిన ప్రాజెక్ట్ ఆఫీసర్(పీఓ)గా రెగ్యులర్ అధికారి లేరు. ఇన్‌చార్జ్‌తో పాలన కొనసాగుతున్నది. దీంతో తమకు ఎలాంటి పథకాలు అందడం లేదంటూ చెంచులు ఆవేదన చెందుతున్నారు. ‘‘మా సమస్యలు చెప్పుకుందామంటే ఆఫీసులో వినే దిక్కు లేదు. పథకాలు అడుగుదామంటే అధికారి లేడు. ఉపాధి లేక, వసతి గృహాల్లో పిల్లలకు సరైన సంరక్షణ ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలి. పూర్తి స్థాయి ప్రాజెక్ట్ ఆఫీసర్‌ను నియమించాలి” అని చెంచులు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి

= ఆశ్రమ పాఠశాలల్లో చదువులు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు లేకపోవడంతో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులే డిప్యూటీ వార్డెన్లుగా అదనపు బాధ్యతలు మోస్తున్నారు. అటు స్కూల్, ఇటు హాస్టల్ నిర్వహణ భారంగా మారింది.
= కొత్తగా మంజూరైన పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
= ప్రభుత్వ పథకాలను పర్యవేక్షించాల్సిన అధికారులు లేక స్కీమ్స్ అమలు నిలిచిపోయింది. ఉపాధి హామీ పనుల నుంచి నిత్యావసరాల పంపిణీ వరకు ప్రతిదీ సిబ్బంది కొరత కారణంగా ఆగిపోయింది.
= నల్లమలలోని పెంటలు, గూడేలకు వెళ్లి పనులు పర్యవేక్షించే ఫీల్డ్ స్టాఫ్ కొన్నేళ్లుగా లేరు.
= ఉపాధి హామీ పథకం కింద చెంచులకు ప్రత్యేకంగా అమలు చేయాల్సిన ‘స్పెషల్ ప్రాజెక్ట్’ వంటివి సుమారు నాలుగేళ్లుగా నిలిచిపోవడం వల్ల వారికి పనులు దొరకడం కష్టతరమైంది.

సిబ్బంది లేకే ఇబ్బంది

= చెంచుల పిల్లల కోసం నడిపే ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో వంట మనుషులు, కాపలాదారులు, ఇతర నాలుగో తరగతి సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.
= ఐటీడీఏ ఆఫీసులో పరిపాలన సాగించాల్సిన సూపరింటెండెంట్, మేనేజర్ స్థాయి పోస్టుల్లో దాదాపు 16 ఖాళీగా ఉన్నాయి.
= ఐటీడీఏకు దిక్సూచిలా ఉండాల్సిన ప్రాజెక్ట్ ఆఫీసర్ (పీఓ)గా రెగ్యులర్‌ అధికారి లేకపోవడం, ఇన్‌చార్జ్‌ పాలన సాగుతుండటం ప్రధాన సమస్యగా మారింది.

మంత్రులొచ్చినా మారని తీరు

గత నెల చివర్లో మంత్రులు మన్ననూర్‌‌ను సందర్శించి రూ.12.70 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా సౌర జల గిరి వికాస పథకాన్ని ప్రారంభించారు. అయినా పరిస్థితుల్లో మార్పు లేదని చెంచులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను మైదాన ప్రాంతాలకు పంపాలని ప్రయత్నం చేస్తున్న కారణంగానే సంక్షేమ పథకాలు నిలుపుదల చేశారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొత్త పథకాలు రాకున్నా, కనీసం ఉన్న వాటినైనా అమలు చేయడం లేదని వాపోతున్నారు.

మన్ననూర్‌‌లోనే ఎందుకిలా?

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీడీఏ ప్రాజెక్టుల్లో ఎక్కడా సిబ్బంది కొరత లేదని, కేవలం మన్ననూర్ ఐటీడీఏ ప్రాజెక్టు పరిధిలోనే ఎందుకిలా సిబ్బంది కొరత ఉన్నదని చెంచులు ప్రశ్నిస్తున్నారు. మన్ననూర్ ఐటీడీఏ ప్రాజెక్టు పరిధిలో నాగర్ కర్నూల్, మహబూబ్‌గర్, వికారాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల పరిధిలోని 26 మండలాలు, 150 గ్రామాల పరిధిలో 4,500 చెంచు కుటుంబాలు ఉన్నాయి. 15,500 మంది చెంచులు ఉన్నారు. వీళ్లందరికీ కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మన్ననూర్ ఐటీడీఏదే. కానీ చెంచులకు తాగునీరు, ఆహారం, విద్య, వైద్యం అందడం లేదని గిరిజన సంఘాలు చెబుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>