కలం, నర్సంపేట: దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను నర్సంపేట మున్సిపాలిటీ అధికారులు ఆదివారం రాత్రి కూల్చివేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో విగ్రహం ఏర్పాటు కోసం గద్దెను నిర్మించగా.. సంబంధిత అనుమతులు లేవన్న కారణంతో అధికారులు దానిని తొలగించినట్లు సమాచారం.
రాత్రివేళ గద్దెను కూల్చివేసిన విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్థలంలో విగ్రహ ఏర్పాటుకు గద్దె నిర్మిస్తే రాత్రి సమయంలో కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి (Peddi Sudarshan Reddy)పై అభిమానంతో విగ్రహం ఏర్పాటు చేయాలనుకుంటే అడ్డుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.
రాజకీయ కక్షేనా?
గద్దె కూల్చివేత వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిచెంది కొద్దిరోజులే అయిన నేపథ్యంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన గద్దెను తొలగించడం బాధాకరమని పేర్కొన్నారు. అధికారుల చర్యలను తీవ్రంగా ఖండించారు.
అనుమతులపై స్పష్టత ఏది?
మరోవైపు గద్దె నిర్మాణానికి మున్సిపాలిటీ నుంచి అనుమతులు ఉన్నాయా? లేదా? అనుమతులు లేకుంటే అధికారులు ఏ నిబంధనల ప్రకారం కూల్చివేత చేపట్టారు? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ప్రైవేట్ స్థలంలో నిర్మాణం జరిగినప్పటికీ మున్సిపల్ నిబంధనలు వర్తిస్తాయా? వర్తిస్తే ముందస్తు నోటీసులు ఇచ్చారా? అనే అంశాలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.
అధికారులు మాత్రం నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకున్నారా? లేక రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలోనే కూల్చివేత జరిగిందా? అన్నది తేలాల్సి ఉంది. ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు అధికారికంగా ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.
పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతితో ఇప్పటికే నర్సంపేట రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఆయన విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దె కూల్చివేత కొత్త వివాదానికి తెరలేపింది. దీంతో నర్సంపేటలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

