కలం, ఖమ్మం బ్యూరో: కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి స్త్రీ ఆర్థిక స్వావలంబన సాధించి “ఉక్కు మహిళ”గా ఎదగాలని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క) (Minister Seethakka) పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్లతో కలిసి ఆదివారం మంత్రి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అశ్వారావుపేట గిరిజన విద్యా వికాస కేంద్రంలో రూ.25 లక్షలతో కాంపౌండ్ వాల్, నాచారంలో రూ.1 కోటితో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు సీతక్క శంకుస్థాపన చేశారు. అలాగే చీపురుగూడెంలో రూ.10 లక్షలతో నిర్మించిన స్వయం శక్తి గ్రామ మహిళా సంఘ భవనం, కొత్తూరులో రూ.12 లక్షలతో పూర్తి చేసిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు.
అలాగే దమ్మపేట, కొత్తూరులలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశాలు, గర్భిణీలకు నిర్వహించిన శ్రీమంతం కార్యక్రమాల్లో పాల్గొని పౌష్టికాహార విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తోందని, ఈ నిధులను ఆదాయం వచ్చే వ్యాపారాల్లో వినియోగించుకోవాలని సూచించారు. స్థానిక వనరులతో కారం, పసుపు, పుట్టగొడుగుల పెంపకం వంటి చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించి ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో 8,000 గ్రామ సంస్థలకు నూతన భవనాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

