కలం, భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ (Bibinagar) మండలంలో పోలీసులు భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు. సుమారు రూ.54 కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కొండమడుగు శివారులో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా వేగంగా వెళ్తున్న ఓ ఫార్చ్యూనర్ కారును ఆపి తనిఖీ చేశారు. కారులో సుమారు 27 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్స్‌తో పాటు 40 కిలోల అసిటోన్ లిక్విడ్‌ను గుర్తించారు. డ్రగ్స్‌తో పాటు వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. డ్రగ్స్‌ను కొండమడుగులోని ‘వేటుకూరి ల్యాబ్స్’లో అక్రమంగా తయారు చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో వెంటనే ల్యాబ్‌పై దాడి చేసిన పోలీసులు డ్రగ్స్ తయారీకి వినియోగిస్తున్న రియాక్టర్, సెంట్రిఫ్యూజ్‌తో పాటు పలు యంత్ర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. భారీగా తయారు చేసిన డ్రగ్స్‌ను కొండమడుగు నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డ్రగ్స్ తయారీ, సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

