కలం, స్పోర్ట్స్ : 2027 వన్డే వరల్డ్ కప్‌కు టీమిండియా సిద్ధమవుతున్న వేళ.. మహ్మద్ షమీపై కీలక చర్చ మొదలైంది. వెటరన్ పేసర్‌ను జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ (Zaheer Khan) మద్దతు తెలిపాడు. షమీ దేశవాళీ క్రికెట్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. ఇలాంటి ప్రదర్శన చేస్తున్న ఆటగాడిని జాతీయ జట్టు పరిశీలనలో తప్పకుండా ఉంచాలని సూచించాడు. షమీ ఫిట్‌గా ఉండి అందుబాటులో ఉంటే.. అతడిని 2027 వరల్డ్ కప్ కోసం దక్షిణాఫ్రికాకు తీసుకెళ్లాలని జహీర్ అభిప్రాయపడ్డాడు.
అక్కడి పరిస్థితులను ఎదుర్కోవడానికి అనుభవం ఉన్న బౌలర్ అవసరమని చెప్పాడు. ఇటీవల దేశవాళీ క్రికెట్‌లోనూ షమీ సత్తా చాటాడు. గత సీజన్‌లో ఏడు రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో 37 వికెట్లు పడగొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఏడు మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు తీసుకున్నాడు. ప్రపంచకప్‌లోనూ షమీకి మంచి రికార్డు ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు. ఆ టోర్నీలో 24 వికెట్లు పడగొట్టాడు. షమీ చిన్ననాటి కోచ్ మహ్మద్ బద్రుద్దీన్ కూడా అతడిపై నమ్మకం వ్యక్తం చేశాడు. షమీ ఇప్పటికీ అత్యున్నత స్థాయిలో ఆడగల సామర్థ్యం కలిగి ఉన్నాడని చెప్పాడు.
ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో బౌలింగ్ చేయడం అంత సులువు కాదని బద్రుద్దీన్ పేర్కొన్నాడు. అక్కడ రాణించాలంటే అనుభవం చాలా అవసరమని చెప్పాడు. అయితే షమీ తన నియంత్రణలో ఉన్న విషయాలపైనే దృష్టి పెట్టాలని జహీర్ ఖాన్ సూచించాడు. తాను ఆడే ప్రతి మ్యాచ్‌లో బంతితో అత్యుత్తమంగా సహకరించడంపైనే ఫోకస్ పెట్టాలని చెప్పాడు. దేశవాళీ క్రికెట్‌లో ఇదే స్థాయిలో నిలకడగా రాణిస్తే.. జాతీయ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు బలపడతాయని జహీర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

