కేంద్ర నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి: సునీల్ రావు

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కరీంనగర్ నగరం అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి పనులపై గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Sunil Rao) విమర్శించారు. కరీంనగర్‌లోని ఎస్‌బీఎస్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ నాయకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు అవుతున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు నగర అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ఆరోపించారు. “సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది” అన్నట్లుగా  రాష్ట్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న పనులను తమ ఘనతగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా భారీగా అప్పులు చేసినప్పటికీ కరీంనగర్ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదని విమర్శించారు.

కేంద్ర పథకాలతోనే నగర అభివృద్ధి

కరీంనగర్‌లో అమలవుతున్న స్మార్ట్ సిటీ, అమృత్-1, అమృత్-2, యూఐడీఎఫ్, ఆర్వోబీ, సీఆర్‌ఎఫ్, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వంటి పథకాలకు కేంద్ర ప్రభుత్వమే ప్రధానంగా నిధులు సమకూర్చిందని ఆయన తెలిపారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం నిధులు సమకూర్చాల్సి ఉండగా, మొత్తం 46 అభివృద్ధి పనుల్లో 41 పనులు పూర్తయ్యాయని చెప్పారు. అమృత్ పథకం రెండు విడతల్లో రూ.274 కోట్లు, మూడో విడతలో మరో రూ.80 కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో కరీంనగర్ నగర అభివృద్ధికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.840 కోట్ల నిధులు సమకూరాయని సునీల్ రావు పేర్కొన్నారు. బీజేపీ పాలకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు యూసీఎఫ్ పథకాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు.

ఆర్వోబీ పనులపై విమర్శలు

కరీంనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులపై కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, అయితే ఇప్పటివరకు భూసేకరణ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. సేతుబంధన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.156 కోట్లు మంజూరు చేసినప్పటికీ పనులు ముందుకు సాగకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. రైల్వే స్టేషన్ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఒక్క రూపాయి కూడా లేదని, సీఆర్‌ఎఫ్ కింద వందల కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా బండి సంజయ్ కుమార్ చొరవతో వచ్చాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ వాటితో పనులు పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని సునీల్ రావు ఆరోపించారు. కేంద్ర పథకాల గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ నాయకులు పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

ప్రత్యేక పథకం తీసుకురావాలి

రాబోయే మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటే, అందులో నుంచి కరీంనగర్ నగర అభివృద్ధికి కనీసం రూ.1,000 కోట్ల ప్రత్యేక పథకాన్ని తీసుకురావాలని సునీల్ రావు సవాల్ చేశారు. కరీంనగర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతోనే సాధ్యమయ్యాయని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. కరీంనగర్ నగర అభివృద్ధికి ప్రత్యేక పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకురావాలని, రాజకీయ ఆరోపణలకు బదులుగా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో 47వ డివిజన్ కార్పొరేటర్ గాజ రామ-శివరాం, 22వ డివిజన్ కార్పొరేటర్ బండ రమణారెడ్డి, 49వ డివిజన్ కార్పొరేటర్ ఎన్నం లక్ష్మి-ప్రకాష్, 53వ డివిజన్ కార్పొరేటర్ కొంపెల్లి శ్వేత-రామణ్, 43వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం లక్ష్మి-మొండయ్య గౌడ్, 57వ డివిజన్ కార్పొరేటర్ కొలిపాక రమ్య-శ్రీనివాస్, బీజేపీ నాయకులు కుంభం అనిల్, పండుగ నాగరాజ్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>