కలం, ఖమ్మం బ్యూరో: దట్టమైన అడవుల నడుమ, పచ్చని ప్రకృతి ఒడిలో విసిరేసినట్లుండే గిరిజన గూడేలు అమాయకత్వానికి, ఆత్మీయతకు నిలువెత్తు సాక్ష్యాలు. ఆధునిక నాగరిక సమాజపు కల్మషాలకు దూరంగా ఉంటూ, అడవినే నమ్ముకుని, తమ ప్రత్యేక ఆచార వ్యవహారాలను ప్రాణప్రదంగా కాపాడుకుంటున్న ఆదివాసీల జీవన శైలి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుంది. తరతరాలుగా అటవీ సంపదను, పర్యావరణాన్ని కాపాడుతూ సమిష్టి జీవనం సాగిస్తున్న ఈ గిరిపుత్రుల హక్కుల రక్షణ కోసం ఐక్యరాజ్యసమితి 1994లో ప్రతి ఏటా ఆగస్టు 9ని “ప్రపంచ ఆదివాసీ దినోత్సవం” (Adivasi Day) గా ప్రకటించింది. 1982లో జెనీవాలో జరిగిన తొలి సమావేశం మొదలుకొని దశాబ్దాల పాటు సాగిన అధ్యయనాల ఫలితంగా లభించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు, ఆదివాసీల ఆత్మగౌరవ పోరాటానికి ఒక కొండంత అండగా నిలిచింది.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన సంస్కృతి ఉప్పొంగింది. “జల్, జంగల్, జమీన్” నినాదంతో గిరిజనుల హక్కుల కోసం అమరుడైన కొమురం భీమ్ విగ్రహాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. సంప్రదాయ మేళతాళాలు, గిరిజన నృత్యాలతో గూడేల ప్రజలు తమ సంస్కృతిని సగర్వంగా చాటుకున్నారు. కొమురం భీమ్ ఆశయాలు, ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి ఆదివాసీ యువతకు ఎల్లప్పుడూ దిక్సూచిలా నిలుస్తుందని నాయకులు కొనియాడారు.
అయితే, ఈ ఉత్సవాలు, సంస్కృతీ సంప్రదాయాల వెనుక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 6.83 లక్షల మంది ఆదివాసీల నిజ జీవితాలు మాత్రం కష్టాల కడలిలో ఈత కొడుతున్నాయి. ఐటీడీఏ లెక్కల్లో సంక్షేమం జోరుగా సాగుతున్నట్లు కాగితాలపై భేషుగ్గా కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో వారి బతుకుచిత్రం మాత్రం ఇంకా చీకట్లోనే కొట్టుమిట్టాడుతోంది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా గిరిపుత్రుల వికాసం కోసం రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో పథకాలు అమలు చేస్తున్నామని అధికారులు చెప్తున్నా, ఆ కోట్లాది రూపాయల నిధులు నిజంగా ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో అనే ప్రశ్న తలెత్తక మానదు.
పోడు సాగే ప్రధాన జీవనాధారంగా భావించి 1,51,195 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ట్రైకార్, గిరివికాస్ పథకాల ద్వారా రుణాలందిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, ఆ పెట్టుబడులు గిరిజనుల పేదరికాన్ని మార్చలేకపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అక్షరాస్యత 49 శాతానికి పెరిగినప్పటికీ, చదువుకున్న యువతకు సరైన ఉపాధి, ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ అవకాశాలు లభించకపోవడంతో వారి నెలసరి ఆదాయం ఇప్పటికీ పదివేల రూపాయల లోపే ఆగిపోయింది. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరల కాలంలో ఈ పదివేల రూపాయలతో కుటుంబాన్ని గడపడం గిరిపుత్రులకు రోజువారీ సవాలుగా మారింది.
మరోపక్క మారుమూల గూడేలైనా చర్ల మండలం రాళ్లపురం, కిష్టారంపాడు, రామచంద్రాపురం వంటి గ్రామాలకు వెళ్లేందుకు కనీస రహదారులు లేక, తాగడానికి సురక్షితమైన నీరు అందక, అత్యవసర వేళల్లో ప్రాథమిక వైద్య సదుపాయాలు లభించక గిరిజన గ్రామాలు అల్లాడుతున్నాయి. దీనికితోడు ఐటీడీఏలో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల అధికారుల పర్యవేక్షణ పూర్తిగా దెబ్బతింది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించడంతో ప్రభుత్వ నిధులు పక్కదారి పడుతున్నాయని, పథకాల ఫలాలు నిజమైన లబ్ధిదారులకు దూరమవుతున్నాయని గిరిజన సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
కాగితాల్లో చూపే కోట్ల రూపాయల ప్రకటనలకే పరిమితం కాకుండా, ఐటీడీఏ యంత్రాంగాన్ని బలోపేతం చేసి, గూడేలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే గిరిపుత్రుల కష్టాలకు శాశ్వత విముక్తి లభిస్తుంది. అప్పుడే అటవీ బిడ్డల ఆత్మగౌరవ పోరాటానికి సార్థకత చేకూరి, అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ అసలైన లక్ష్యం నెరవేరుతుందనీ పలువురు మేధావులు, ఆదివాసీ నాయకులు పేర్కొంటున్నారు.

