కలం, స్పోర్ట్స్ : అఫ్గానిస్థాన్ శరణార్థి జైనొల్లా ఇహసాన్ (Zainullah Ihsan) క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నారు. కెనడా, యుఏఈలతో జరిగే క్రికెట్ వరల్డ్ కప్ లీగ్-2 ట్రై-సిరీస్ కోసం స్కాట్లాండ్ జట్టులో ఈ 20 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ చోటు దక్కించుకున్నారు. త్వరలోనే ఆయన స్కాట్లాండ్ తరఫున వన్డే అరంగేట్రం చేసే అవకాశముంది. జైనొల్లా ఇహసాన్ ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకం. అఫ్గానిస్థాన్‌లోని నంగర్హార్లో కేవలం ట్యాప్ బాల్ క్రికెట్ ఆడిన ఆయన, జూన్ 1, 2022న శరణార్థిగా స్కాట్లాండ్లోని గ్లాస్గోకు చేరుకున్నారు.
ఆ సమయంలో ఆయనకు ఇంగ్లీష్ కూడా రాదు. వచ్చిన రెండు వారాల్లోనే స్థానిక క్రికెట్ క్లబ్‌ను కనుగొని, మొదటి మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించారు. నాలుగేళ్ల వ్యవధిలోనే ఇంగ్లీష్ నేర్చుకోవడంతో పాటు క్రికెట్లో వేగంగా ఎదుగుతూ వచ్చారు. ఇప్పటికే స్కాట్లాండ్ తరఫున రెండు టీ20 మ్యాచ్‌లు ఆడిన ఇహసాన్, 19 ఏళ్ల వయసులోనే భారత్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 జట్టులోనూ చోటు సంపాదించారు.
ఎలాంటి ప్రొఫెషనల్ క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే, క్లబ్ స్థాయి నుంచి తన ప్రతిభతో జాతీయ జట్టు స్థాయికి ఎదిగారు. వరల్డ్ కప్ లీగ్-2 సిరీస్ స్కాట్లాండ్కు ఎంతో కీలకమైనది. ఈ టోర్నీ ద్వారా వన్డే క్యాప్ సాధిస్తే, శరణార్థిగా వచ్చిన ఐదేళ్లలోపే అంతర్జాతీయ వన్డే ప్లేయర్‌గా మారిన ఘనత ఆయన (Zainullah Ihsan) సొంతమవుతుంది. జైనొల్లా ఇహసాన్ కథ కేవలం ఆటకే పరిమితం కాకుండా, కష్టపడే తత్వం ఉంటే ఏ రంగంలోనైనా సాధించవచ్చని నిరూపిస్తోంది.

