కలం, వనపర్తి: బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపు ఇవ్వడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం సాగు నీరు వదులుతోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వనపర్తి (Wanaparthy) జిల్లా కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలువల్లో నీరు రాదని, నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కదిరి రాములు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ మధుసూదన్ గౌడ్ తదితరులు మాట్లాడారు.
15 రోజుల ముందే పనులు..
బుద్ధారం రిజర్వాయర్‌లోకి నీటి విడుదల చేసేందుకు అవసరమైన పనులను 15 రోజుల ముందుగానే చేపట్టామని కాంగ్రెస్ నాయకులు వివరించారు. అవి పూర్తయిన తరువాతే కాలువల్లోకి నీరు చేరిందన్నారు. దీన్ని బీఆర్ఎస్ నేతలు తమ ఘనతగా చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో కృష్ణానది, ప్రాజెక్టులకు నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో రైతులకు సాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నీటి లభ్యత ఏర్పడిన వెంటనే మోటార్లు ప్రారంభించి, రిజర్వాయర్లను నింపుతూ, దశలవారీగా కాలువలకు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. కరువు వస్తే రాజకీయంగా లబ్ధి పొందాలని బీఆర్‌ఎస్ నాయకులు చూస్తున్నారని ఆరోపించారు.
ఆగస్టు ఒకటి నుంచే మోటార్లు ఆన్..
ఎంజీకేఎల్‌ఐ ఒకటో, రెండో లిఫ్ట్‌లను ఆగస్టు ఒకటో తేదీ నుంచే మోటార్లు ఆన్ చేయడంతో నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఇప్పటివరకు శ్రీశైలం నుంచి 2.7 టీఎంసీల నీటిని ఎత్తిపోశామని పేర్కొన్నారు. మూడో లిఫ్ట్ నుంచి ఆగస్టు ఆరో తేదీన ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయని స్పష్టం చేశారు. మొత్తం మూడు పంపుల ద్వారా 2,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 2,100 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో ఉందని చెప్పారు. అదే రోజు 29వ ప్యాకేజీ కల్వకుర్తి ఎడమ కాలువ ద్వారా 2,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
వాస్తవాలు మరిచి విమర్శలా..?
ఆగస్టు 7న అన్ని కాలువలకు సాగునీటిని విడుదల చేశామని, ఆగస్టు 8న ఉదయం గుడిపల్లి రిజర్వాయర్ వద్ద గేట్లు ఎత్తి కాలువలకు నీటిని విడుదల చేసినట్లు కాంగ్రెస్ నేతలు వివరించారు. వాస్తవాలు కళ్లముందు ఉన్నా ‘మోటార్లు ఆన్ చేయలేదు.. రైతులకు నీళ్లు ఇవ్వడం లేదు’ అంటూ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మోటార్లు ఎప్పుడు ప్రారంభించామో, ఎంత నీరు ఎత్తిపోశామో, రిజర్వాయర్లలో ఎంత నీరు ఉందో, కాలువలకు ఎప్పుడు నీరు విడుదల చేశామో తేదీలతో సహా చెబుతున్నామని పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకోవాలంటే అవసరమైన అనుమతులు, సాంకేతిక ప్రక్రియలు ఉంటాయన్న కనీస వాస్తవాన్ని కూడా విస్మరించి మాట్లాడటం సరికాదన్నారు.
గత పాలనలో అక్రమ కేసులు..
ఎమ్మెల్యేగా ఎవరు ఉండాలనేది ప్రజలే నిర్ణయిస్తారని, ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. గత పాలనలో ప్రజలు భయాందోళనలకు గురయ్యారని, ప్రశ్నించిన 70–80 మందిపై రౌడీషీటర్ కేసులు పెట్టారని ఆరోపించారు. వనపర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్, మాజీ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మం చారి, కౌన్సిలర్ క్రాంతి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త లాక్కాకుల సతీష్, పీసీసీ ఓబీసీ నాగర్ కర్నూల్ జిల్లా పరిశీలన తిరుపతయ్య యాదవ్, నాయకులు బి.కృష్ణ, ఎస్.ఎల్.ఎన్ రమేష్, చుక్క రాజు, నక్కరాజు, చీర్ల సత్యం సాగర్, మాజీ సర్పంచి కృష్ణయ్య, ఎల్ఐసీ కృష్ణ, రాఘవేందర్ పాల్గొన్నారు.

