కలం, ఖమ్మం బ్యూరో: శాంతిభద్రతలకు నిలయమైన ఖమ్మం (Khammam) జిల్లాలో ఇటీవల సంచలనం సృష్టించిన వృద్ధురాలి దారుణ హత్య కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. జులై 17 అర్ధరాత్రి తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఉదంతం వెనుక ఉన్నది మరెవరో కాదు.. బాధితురాలి ఇంటి సమీపంలోనే చికెన్ షాప్ నడుపుకునే వ్యక్తి అని తేలడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, మద్యపాన వ్యసనానికి బానిసై చేసిన అప్పులు తీర్చేందుకు, వృద్ధురాలి బంగారు ఆభరణాల కోసం ఇనుప రాడ్డుతో మోది హత్య చేసినట్లు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితోపాటు అతనికి సహకరించిన మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి వివరాలు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. పిండిప్రోలు గ్రామానికి చెందిన ఐతనబోయిన ప్రశాంత్ (26) చికెన్ షాప్ నిర్వహిస్తున్నాడు. అతనికి ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, మద్యం సేవించే అలవాటు ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. ఈ క్రమంలో తన షాప్ సమీపంలోనే నివసించే సుగుణ అనే వృద్ధురాలి మెడలోని బంగారు ఆభరణాలపై కన్నేశాడు. వాటిని దొంగిలించి అప్పులు తీర్చుకోవాలని పక్కా పథకం వేశాడు. జులై 17 అర్ధరాత్రి సుగుణ ఇంటికి వెళ్లిన ప్రశాంత్, ఆభరణాలు దోచుకునే ప్రయత్నం చేయగా ఆమె గట్టిగా ప్రతిఘటించింది. దీంతో కంగారుపడిన నిందితుడు తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఆమె మెడలోని బంగారు చైన్, నల్లపూసల గొలుసుకు ఉన్న బంగారు బిళ్లలను దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యాడు.
హత్య అనంతరం ప్రశాంత్ దొంగిలించిన బంగారు చైన్‌ను తన బావమరిది వరుసయ్యే సరగండ్ల మహేశ్ (20)కి ఇచ్చాడు. మహేశ్ ఆ చైన్‌ను ఖమ్మంలోని ఒక బ్యాంకులో తన పేరు మీద తాకట్టు పెట్టి రూ.1.5లక్షలు రుణం పొందినట్లు విచారణలో తేలింది. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కూసుమంచి సీఐ సంజీవ్ నేతృత్వంలో కే. జగదీశ్, పి. సంతోష్, జె. నాగరాజు, హరికృష్ణ, ఎస్ఐ దివ్యలతో కూడిన నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సాంకేతిక ఆధారాలతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు ఆదివారం ఉదయం తిరుమలాయపాలెం రోడ్డులో నిందితులు ప్రశాంత్, మహేశ్‌లను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి 9 బంగారు బిళ్లలు, గోల్డ్ లోన్ పత్రాలు, 2 మొబైల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన సిబ్బంది పూర్ణచందర్ రావు, శ్రీలత, కిషన్, రాంబాబు, తొంట శ్రీనులను ఉన్నతాధికారులు అభినందించి రివార్డులు అందజేశారు. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ తెలిపారు.

