కలం, వెబ్‌డెస్క్: ఇరాన్ ప్రభుత్వం తొలిసారి సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) వీడియోను విడుదల చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మాజీ సుప్రీం అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఆయన వారసుడిగా మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. కొద్ది రోజుల నుంచి ఆయన ఆరోగ్యంపై అంతర్జాతీయ మీడియాలో భిన్న కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అధికారిక మీడియా ఒక వీడియోను విడుదల చేసింది.
12 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో మొజ్తబా ఖమేనీ నల్లటి తలపాగా, బూడిద రంగు గౌను ధరించి తోటివారితో కూర్చొని కనిపిస్తున్నారు. అయితే ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారనే దానిపై స్పష్టత లేదు. ప్రచారాలకు భిన్నంగా ఆయన వీడియోలో పూర్తి ఆరోగ్యంతో కనిపిస్తున్నారు. మొజ్తబా ఖమేనీ మార్చి 8న సుప్రీం లీడర్‌గా నియమితుడైనా ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యక్ష ప్రసంగాలు చేయలేదు. ఆయన తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. ఆయనతో కమ్యూనికేషన్ చాలా కష్టంగా ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఇటీవల పేర్కొన్నారు. మరోవైపు మొజ్తబా ఆరోగ్యం క్షీణించిందని అమెరికా, ఇజ్రాయెల్ వర్గాలు మీడియా ముందు ఆరోపిస్తున్నాయి.

