కలం, ఖమ్మం బ్యూరో: పాఠాలు చెప్తానంటూ 11 ఏళ్ల చిన్నారిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో ఓ రాజకీయ నాయకుడిపై పోక్సో కేసు నమోదైంది. తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ వైరా నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న గౌరవరపు డేవిడ్ రాజ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు డేవిడ్ రాజ్ మద్యం సేవించి ఖమ్మం (Khammam), వైరాలోని ఓ బాలిక ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో చిన్నారికి లెక్కలు చెబుతానని నమ్మించాడు. చిన్నారిని అసభ్యంగా ప్రవర్తిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. సాయంత్రం కూలీ పనులకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి రాగానే, బాలిక జరిగిన విషయం గురించి వివరించింది.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తక్షణమే ‘డయల్ 100’ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ పుష్పాల రామారావు ఘటన స్థలానికి చేరుకుని డేవిడ్ రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, నిందితుడు డేవిడ్ రాజ్‌పై గతంలోనే రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

