కలం, ఖమ్మం బ్యూరో: భార్య ఫోన్ ఎత్తకపోవడం, పైగా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో మనస్తాపం చెందిన ఓ భర్త ‘డెత్ నోట్’ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కఠిన నిర్ణయానికి భార్య, మామే కారణమని చేతిపై రాసి బలవన్మరణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఖమ్మం (Khammam) జిల్లా తనికెళ్ల గ్రామంలో విషాదం నింపింది. స్థానిక ఎస్ఐ జీ. సురేశ్ వివరాల ప్రకారం.. తనికెళ్ల గ్రామానికి చెందిన పెద్ద గౌండ్ల గోపాల్ రావు (27)కు భార్య రజనీతో కుటుంబ గొడవలు తలెత్తాయి. ఈ క్రమంలో మనస్పర్థలు తీవ్రం కావడంతో రజనీ పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను సమాధాన పరిచేందుకు గోపాల్ రావు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఆమె స్పందించలేదు.
పదే పదే ఫోన్ చేసి విసిగిస్తే పోలీసులకు పిర్యాదు చేస్తానని రజనీ బెదిరించింది. భార్య ప్రవర్తన, హెచ్చరికలతో ఆందోళన, మనస్తాపానికి గురైన గోపాల్ రావు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పరిశీలించగా, గోపాల్ రావు తన చేతిపై “నా చావుకు కారణం భార్య రజనీ, మామ ముట్ట సీతారాములు” అని రాసుకుని ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

