కలం, వెబ్‌డెస్క్: ఇరాన్ (Iran)తో గత ఐదు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం (War) అమెరికాపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నట్టు కనిపిస్తున్నది. వైమానిక దాడుల కారణంగా క్షిపణులు, మిసైల్ డిఫెన్స్ వ్యవస్థల నిల్వలు తగ్గుతున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించే దిశగా చర్యలు చేపట్టాలని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బృందానికి సూచించినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్‌పై మరిన్ని సైనిక చర్యలకు దిగడం వల్ల అనుకున్న ఫలితాలు రావడం కష్టమని డాన్ కేన్ హెచ్చరించినట్లు సమాచారం.
వైమానిక దాడులతో లక్ష్యాలు సాధించలేం
కేవలం వైమానిక దాడులతోనే నిర్దేశిత సైనిక లక్ష్యాలను పూర్తిగా సాధించడం సాధ్యం కాదని డాన్ కేన్ పేర్కొన్నట్టు తెలుస్తున్నది. ఇరాన్‌తో యుద్ధాన్ని మరింత విస్తరించడం కంటే.. ఘర్షణ నుంచి బయటపడేందుకు మార్గాలను అన్వేషించాలని ఆయన సూచించినట్టు సమాచారం. ఈ అంశంపై డాన్ కేన్ పలువురు కీలక అధికారులతోనూ చర్చలు జరిపినట్లు సమాచారం. సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు పలువురు క్యాబినెట్ అధికారులతో ఆయన యుద్ధ పరిస్థితిపై చర్చించినట్టు తెలుస్తున్నది. అమెరికా ఆయుధ నిల్వలు తగ్గుతున్నాయన్న వాదనలను ట్రంప్ కొట్టిపారేశారు. తమ వద్ద భారీగా ఆయుధ నిల్వలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. రక్షణ రంగ సంస్థలు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ సంఖ్యలో ప్లాంట్లు, ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నాయని తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ పరిణామాల మధ్య జనరల్ డాన్ కేన్ సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
భారత్‌పై 100% టారిఫ్
రష్యా నుంచి భారీగా చమురు, సహజవాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా మరింత ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నది ఈ దిశగా కీలకమైన బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. లిండ్సే ఓ. గ్రాహమ్ సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026 పేరుతో రూపొందించిన బిల్లును శుక్రవారం 86-11 ఓట్ల తేడాతో సెనేట్ ఆమోదించింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా చమురు లేదా సహజవాయువును అత్యధికంగా కొనుగోలు చేసే తొలి ఐదు దేశాలపై అమెరికా అధ్యక్షుడు గరిష్ఠంగా 100 శాతం టారిఫ్ విధించే అవకాశం ఉంటుంది. రష్యా నుంచి భారీగా ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనా ఈ ప్రతిపాదిత చర్య పరిధిలోకి వచ్చే అవకాశముంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం తోడ్పడుతోందని అమెరికా భావిస్తున్నది.
భారత్‌పై ఎఫెక్ట్
బిల్లు చట్టంగా మారి.. ట్రంప్ 100 శాతం టారిఫ్ విధిస్తే అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇంజినీరింగ్ వస్తువులు, ఔషధాలు, రసాయనాలు, టెక్స్టైల్స్, ఆటో విడిభాగాలు వంటి ఎగుమతి ఆధారిత రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా దిగుమతిదారులు ఇతర దేశాల నుంచి ప్రత్యామ్నాయ ఉత్పత్తులను కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడితే భారత ఎగుమతిదారులపై డిమాండ్ తగ్గే ప్రమాదం ఉంటుంది.

