కలం, ఖమ్మం బ్యూరో: “స్నేహ ధర్మం మేమొక్కరమే పాటిస్తే సరిపోదు. మమ్మల్ని తక్కువ అంచనా వేసి అవమానిస్తే నిన్న బీఆర్ఎస్ కు పట్టిన గతే రేపు మీకు పడుతుంది ” సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) గురువారం చేసిన ఘాటు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మిత్రపక్షంలో పొలిటికల్ హీట్ ను పెంచాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఇలాంటి పరిణామాలకు కేంద్ర బిందువుగా నిలిచాయి. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ప్రభుత్వంలో ముగ్గురు కీలక మంత్రులు ఉన్నారు. మిగిలిన 7 స్థానాల్లో ఒక ఎస్సీ (సత్తుపల్లి), గిరిజన, ఆదివాసీ నియోజకవర్గాలు పోగా, ఉన్న ఒకే ఒక్క జనరల్ స్థానం కొత్తగూడెం. ఇక్కడి నుంచే కాంగ్రెస్ మిత్రపక్ష ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రుల హవా నడుస్తుండటంతో అధికార కాంగ్రెస్ కు చెందిన గిరిజన, ఎస్సీ ఎమ్మెల్యేలకే కనీస గుర్తింపు దక్కడం లేదన్న తీవ్ర అసంతృప్తి క్షేత్రస్థాయిలో బహిరంగగానే చర్చకు వస్తుంది. ఒక చిన్న ట్రాన్స్‌ఫర్ లేదా పోస్టింగ్ కూడా వేయించుకోలేకపోతున్నామని సొంత పార్టీ ఎమ్మెల్యేలే వాపోతున్న పరిస్థితి ఉంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితే ఇలా ఉంటే, ఇక మిత్రపక్షమైన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని పరిస్థితి ఎంత దారుణంగా ఉందో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అధికారులందరూ ఎమ్మెల్యేల మాట పక్కనపెట్టి మంత్రుల ఆజ్ఞలకే ప్రాధాన్యం ఇస్తుండటంతో, కూనంనేని ఒక్కసారిగా ఆక్రోశం వెల్లగక్కారు.
కార్పొరేషన్ ఎన్నికల నుంచే విబేధాలు
కూనంనేని వ్యాఖ్యల వెనుక ప్రస్తుత రాజకీయ పరిణామాలే కాదు. పాత గాయాలు కూడా ఉన్నాయి. గతంలో కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, సీపీఐ పొత్తు లేకుండా పోటీ చేశాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని వ్యూహాలు పన్నింది. ఊహించని విధంగా సీపీఐకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నట్టు బహిరంగంగా చెప్పడంతో, వేరే దారి లేక కాంగ్రెస్ మేయర్ పదవిని సీపీఐకి కట్టబెట్టాల్సి వచ్చింది. అంతేకాకుండా, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పెద్దల అండదండలతో పోలీసులు నిబంధనల పేరుతో కూనంనేనిని వేధింపులకు గురిచేశారనే వార్తలు అప్పట్లో తీవ్ర సంచలనం రేపాయి.
బీఆర్ఎస్‌కు పట్టిన గతే అంటూ..
ఇంద్ర సినిమాలో చిరంజీవి సినిమా డైలాగ్ “మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా” అంటూ.. “ కమ్యూనిస్టులు పది మందే కదా అని తేలికగా తీసుకుంటే.. అదే రేంజ్‌లో బుద్ధి చెప్తాం” అని కూనంనేని వార్నింగ్ ఇవ్వడం వెనక స్పష్టమైన రాజకీయ సమీకరణం ఉంది. గతంలో అధికారాన్ని నెత్తినేసుకుని చిన్న భాగస్వామ్య పక్షాలను, క్షేత్రస్థాయి శ్రేణులను నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ ను ప్రజలు ఎలా ఓడించారో కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలని ఆయన పరోక్షంగా హితవు పలికారు. సీపీఐకి అసెంబ్లీలో ఉన్నది ఒకే ఒక్క సీటు కావచ్చు. కానీ, ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో గెలుపోటములను శాసించే కేడర్ బలంగా ఉంది. మిత్రపక్షానికే కాంగ్రెస్ చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తోందన్న భావన ఇప్పటికే సీపీఐ శ్రేణుల్లో బలంగా నాటుకుపోతోంది.
మంత్రుల పెత్తనానికి చెక్ పడేనా?
మున్సిపల్, లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తుండగా ఇప్పుడు బయటపడ్డ ఈ ఆధిపత్య పోరు అధికార కాంగ్రెస్ కు సవాలుగా మారనుంది. కాంగ్రెస్ అధిష్టానం తక్షణమే జోక్యం చేసుకుని కొత్తగూడెంలో నెలకొన్న మంత్రుల పెత్తనానికి, ప్రోటోకాల్ వివాదాలకు చెక్ పెట్టకపోతే, మిత్రధర్మం కాస్తా వికటించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సొంత పతనానికి దారితీసినా ఆశ్చర్యపోనవసరం లేదనీ పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూనంనేని తాజా వ్యాఖ్యలతో తెరపైకి వచ్చిన ఈ విభేదాలకు కాంగ్రెస్ నాయకత్వం ఎలా స్పందించి పరిష్కారం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

