కలం, వెబ్ డెస్క్: దేశంలో ప్రతి 1000 మంది యువతలో కేవలం 12 మందికి మాత్రమే శాశ్వత ఉద్యోగాలు దక్కుతున్నాయని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకంటే దారుణం ఏం ఉంటుందని ప్రశ్నించారు. రీల్స్ చూడటం, ఇన్ స్టా, వాట్సాప్‌ల్లోకి వాటిని షేర్ చేసుకోవడం యువతకు అతి పెద్ద వ్యసనంగా మారిందన్నారు. ఒకవేళ ఎవరైనా ఉద్యోగాలు కావాలని పాలకులను అడిగితే బ్లింకెట్ లేదా ఉబెర్‌లో పనిచేయాలని లేకపోతే కూలి పనికి వెళ్లాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశ యువతకు ఉద్యోగాలు దొరికే, ఇచ్చే పరిస్థితి లేదన్నారు.
శాసించేవి ఆ రెండు మాత్రమే..
దేశంలో 40 కోట్ల మంది యువత ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. జనాలు చైనా, అమెరికా, రష్యా గురించి గొప్పగా మాట్లాడుతుంటారని, మరి మన యువ శక్తి గురించి ఎవరు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. యువత, డేటా మాత్రమే 21వ శతాబ్దాన్ని శాసించబోతున్న రెండు శక్తులన్నారు. ఇండియాలో యువత భారీ సంఖ్యలో ఉన్నారని.. ప్రపంచంలోనే అత్యధిక డేటా ఖర్చయ్యే దేశం కూడా మనదే అన్నారు. ప్రతి భారతీయుడు రోజుకు కనీసం ఒక జీబీ డేటా వాడుతున్నారని వివరించారు. ఈ రెండింటిని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే దేశం ఊహించనంత ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.

