కలం, స్పోర్ట్స్ : వరస ఐపీఎల్ సీజన్లలో వికెట్లు తీస్తూ అదరగొడుతున్న సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) ను వచ్చే వన్డే ప్రపంచకప్ రేసులోకి తీసుకోవాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రమంలో భారత మాజీ బ్యాటర్ ఆకాష్ చోప్రా దీనిపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
36 ఏళ్ల వయసులో కూడా భువి బౌలింగ్ కంట్రోల్ మరింత మెరుగైంది. ఐపీఎల్ 2025లో 14 మ్యాచుల్లో 17 వికెట్లు తీసిన భువి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ 16 మ్యాచుల్లో 28 వికెట్లతో చెలరేగాడు. దీంతో సౌతాఫ్రికా, నమీబియా, జింబాబ్వేలలో జరిగే వన్డే ప్రపంచకప్ జట్టులో అతడిని చేర్చాలని అభిమానులు, మాజీలు కోరుతున్నారు.
అయితే భువి వన్డే వరల్డ్ కప్ ఆడాలని తాను అనుకుంటున్నా, అతని వర్క్‌లోడ్ పెద్ద సవాలుగా మారిందని చోప్రా అభిప్రాయపడ్డాడు. భువి 2022 నవంబర్ నుంచి టీమిండియాకు ఆడలేదు. అలాగే గడిచిన రెండేళ్లుగా రంజీ ట్రోఫీతో పాటు దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. వన్డే మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేయడంతో పాటు 50 ఓవర్లు ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది.
కేవలం ఐపీఎల్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నాలుగేసి ఓవర్లు వేసినంత మాత్రాన వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక చేయడం సరైంది కాదని చోప్రా అన్నాడు. వరల్డ్ కప్‌కు ముందు కనీసం ఒక ఏడాది పాటు అతడికి తగిన ప్రాక్టీస్ ఇస్తేనే సత్ఫలితాలు ఉంటాయని స్పష్టం చేశాడు.

