కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పాలమూరు యూనివర్సిటీ (Palamuru University) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “విజన్ ఇండియా 2047” జాతీయ సదస్సు శనివారం రెండో రోజు కూడా కొనసాగింది. యూనివర్సిటీ లైబ్రరీ ఆడిటోరియంలో “అకాడమిక్ అండ్ ఇండస్ట్రీ అనుసంధానం” అంశంపై నిర్వహించిన ప్యానెల్ చర్చలో పలువురు నిపుణులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థ సీనియర్ సైంటిస్ట్ డా. ఎన్. రాజేందర్ మాట్లాడుతూ.. పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాల మధ్య మరింత బలమైన భాగస్వామ్యం అవసరాన్ని వివరించారు. విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు ఫలితాలను సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించాల్సిన అవసరం ఉందని వివరించారు.
సాంకేతికతను వైద్య విద్యతో అనుసంధానం..
ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ జోషి మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతను వైద్య విద్యతో అనుసంధానం చేయడం ద్వారా భవిష్యత్ వైద్య నిపుణులను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు. బిట్స్ పిలాని ప్రొఫెసర్ సాయి ప్రసాద్ ఉన్నత విద్యలో నాణ్యత, పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు కేవలం డిగ్రీ పొందడమే లక్ష్యంగా కాకుండా, సమస్యలకు వాటికి సాంకేతిక పరిష్కారాలు చూపించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
కోడ్ తంత్ర సీఈవో, కో-ఫౌండర్ రమణ మాట్లాడుతూ.. పరిశ్రమల అవసరాలు, సాంకేతిక నైపుణ్యాల ప్రాధాన్యత, విద్యార్థుల్లో ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్ పెంపొందించాలన్నారు. విద్యార్థులకు తరగతి గది విద్యతో పాటు పరిశ్రమలలో ఇంటర్న్‌షిప్‌లు, ఇండస్ట్రీ విజిట్లు, లైవ్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీ మెంటరింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్ వంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలన్నారు.
మరికొందరికి ఉపాధి ఇవ్వొచ్చు..
పాలమూరు యూనివర్సిటీ (Palamuru University) రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేష్ బాబు మాట్లాడుతూ.. స్టార్టప్‌లు, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టెక్నాలజీ ఆధారిత వ్యాపార ఆలోచనలను విద్యార్థుల్లో ప్రోత్సహించడం ద్వారా యువతలో స్వయం ఉపాధి అవకాశాలను పెంచవచ్చన్నారు. మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి వారిని తీసుకెళ్లవచ్చని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించాలన్నారు. అకాడమిక్ సంస్థలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు పరస్పర సహకారంతో పనిచేసినప్పుడే విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని.. తమ వర్సిటీ ఆ కోణంలోనే పనిచేస్తోందని తెలిపారు.
Also Read : పటాన్‌చెరు హాస్పిటల్.. సేవలు ఆలస్యం!
Follow Us On : WhatsApp

