మోదీ సర్కార్ విధానాలపై చాడ వెంకటరెడ్డి ధ్వజం

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వాటిని కార్పొరేట్ పెట్టుబడిదారులకు అప్పగిస్తోందని సిపిఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ చేపట్టిన ప్రచార జాతా శనివారం చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, కొండాపూర్, నవాబుపేట, సుందరగిరి గ్రామాలలో పర్యటించింది.

వివిధ గ్రామాలలో నిర్వహించిన కార్యక్రమాలకు సిపిఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు. జాతాకు ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు దేశాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ప్రజా సంక్షేమం, సుపరిపాలన అందిస్తామని బీజేపీ హామీలు ఇచ్చిందని, అయితే వాటిలో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని విమర్శించారు.

ధరల పెరుగుదలతో ప్రజలపై భారం

నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతోందని చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) అన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా ప్రజల ఆదాయం పెరగడం లేదన్నారు. మరోవైపు నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతుండటంతో యువత తీవ్ర నిరాశకు గురవుతోందని తెలిపారు.

రైతులకు మద్దతు ధర చట్టం చేయాలి

రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చినప్పుడు దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారని చాడ వెంకటరెడ్డి గుర్తుచేశారు. చివరకు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందన్నారు. రైతులకు కనీస మద్దతు ధరపై చట్టం తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయకపోవడం దారుణమన్నారు. పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, మహిళా రిజర్వేషన్‌ను తక్షణమే అమలు చేయాలని, ధరల పెరుగుదలను నియంత్రించాలని, ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగావకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

కార్మికుల హక్కులను పరిరక్షించాలి

కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తోందని ఆయన ఆరోపించారు. కార్మిక చట్టాలు, హక్కులను పరిరక్షించాలని కోరారు. సుప్రీంకోర్టు సూచించిన విధంగా సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. దేశంలో సామాజిక న్యాయం దెబ్బతింటోందని, పేదలకు కూడు, గుడ్డ, నీడ వంటి కనీస మౌలిక వసతులు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, ఆదివాసీలపై దాడులు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించాలి

డబ్బున్నవారికే రాజకీయాలలో అధిక ప్రాధాన్యం లభిస్తోందని చాడ వెంకటరెడ్డి అన్నారు. డబ్బు లేని పేదలు కనీసం సర్పంచులుగా కూడా గెలవలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థల అధిపతులు అధికార వ్యవస్థపై ప్రభావం చూపుతున్నారని ఆరోపించారు. ఎన్నికలలో బ్యాలెట్ పేపర్ విధానాన్ని పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ ప్రచార జాతాలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, పొనగంటి కేదారి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జాతా కోఆర్డినేటర్లు గూడెం లక్ష్మీ, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, బోయిని అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యులు చాడ శ్రీధర్‌రెడ్డి, అందె చిన్నస్వామి, తేరాల సత్యనారాయణ, ముద్రకోల రాజయ్య, మావురపు రాజు, మండల సహాయ కార్యదర్శి బూడిద సదాశివ, బీర్ల పద్మ, కొట్టె అంజలి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ ఇంట విషాదం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>