అదొక డేటింగ్ ట్రాప్.. అమ్మాయిలకు సజ్జనార్ హెచ్చరిక

కలం, వెబ్ డెస్క్: అమ్మాయిలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు విసిరే డేటింగ్ స్కామ్స్ (Dating Scams) ట్రాప్‌లో పడితే ఇబ్బందులు తప్పవని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఆగస్ట్ ఫస్ట్ స్పెషల్, 50 శాతం డిస్కౌంట్, రెంట్ బాయ్‌ఫ్రెండ్ అంటూ రకరకాల ఆఫర్లతో ఆకర్షణీయంగా ఉండే యువకుల ఫొటోలతో సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పోస్టర్లను నమ్మొద్దని సూచించారు. ఏఐతో అందమైన కుర్రాళ్ల చిత్రాలను తయారు చేసి, వాటిని ప్రొఫైల్ పిక్స్‌గా, పోస్టర్ల మీద ముద్రిస్తూ మాయ చేస్తున్నారని.. పొరపాటున కూడా వాటి జోలికి వెళ్లొద్దని పేర్కొంటున్నారు.

ఊరించే ఆఫర్ల వెనుక..

ఒంటరిగా ఉండే యువతులు, సరదాగా కాసేపు బయటకు వెళ్లాలనుకునే వారే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు ఇలాంటి ఆఫర్లను పంపిస్తున్నాని సీపీ సజ్జనార్ (CP Sajjanar) వివరించారు. ‘మీరు ఎంచుకున్న వ్యక్తితో గంట కాఫీ మీటింగ్‌కు రూ.499, సినిమాకు వెళ్లాలనుకుంటే రూ.1,249, షాపింగ్ అయితే రూ.1,499, ఈవెంట్లకు తోడు రావడానికి రూ.1,999, అదే ఫుల్ డే ప్యాకేజీ అయితే రూ.4,499 అంటూ పెద్ద లిస్ట్ రెడీ చేస్తున్నారు. కాంటాక్ట్ అయినవారి వివరాలు ఎక్కడా బయటకు రాకుండా చూసుకునే బాధ్యత తమదంటూ ఊరిస్తున్నారు’ అని తెలిపారు.

చాటింగ్ చేస్తే అంతే సంగతులు..

కేటుగాళ్లు చెప్పింది నమ్మి వారితో చాటింగ్ మొదలుపెడితే డబ్బులతో పాటు వ్యక్తిగత ఫొటోలు, సమాచారం తీసుకుని బెదిరింపులకు పాల్పడతారని సీపీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘డిజిటల్ వ్యాలెట్లు, క్యూ ఆర్ కోడ్ల ద్వారా అందినంత మేరకు దోచుకుని.. ఆపై అకౌంట్లను బ్లాక్ చేస్తారు. ఒకవేళ వారిని నమ్మి చెప్పిన ప్రదేశాలకు వెళ్తే అది ఇంకా ప్రమాదం. ఇలాంటి నకిలీ ఆఫర్లపై ఇప్పటికే సైబర్ క్రైం విభాగం ఫోకస్ పెట్టింది. వీటిని నిర్వహిస్తున్నవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు.

తల్లిదండ్రులదే బాధ్యత..

సోషల్ మీడియాలో వచ్చే నకిలీ ఆఫర్ల వలకు అమ్మాయిలు చిక్కకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారు.. ఎవరితో మాట్లాడుతున్నారు. బయటకు వెళ్తే ఎవరెవరిని కలుస్తున్నారు అనే అంశాలను నిరంతరం పరిశీలించాలన్నారు. లేకపోతే నేరగాళ్ల వలలో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సైబర్ నేరాల బారిన పడినవారు 1930 హెల్ప్ లైన్ నెంబర్, http://cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయొచ్చని వివరించారు.

Also Read : రెంట్​ ఏ లైఫ్​!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>