మహబూబ్ నగర్ ఫస్ట్‌ ఆధ్వర్యంలో విద్యా వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్ నగర్ (Mahabubnagar) నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి గౌరవ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారు. విద్యను సామాజిక మార్పుకు మూలస్తంభంగా భావించిన ఆయన, తన సొంత నిధులతో విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. గత విద్యా సంవత్సరం 35 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన విద్యా వాలంటీర్ల వ్యవస్థ విశేష ఫలితాలను అందించింది. విద్యార్థుల హాజరు పెరగడం, అభ్యాస నైపుణ్యాలు మెరుగుపడడం, బలహీన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెరగడం వంటి సానుకూల మార్పులు కనిపించాయి.

ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని విస్తరించి నియోజకవర్గంలోని వంద ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, విద్యావంతులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించి, పారదర్శకంగా ప్రత్యేక ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి, 100 మంది విద్యా వాలంటీర్లను ఎంపిక చేసి, వారికి సమగ్ర శిక్షణ అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆగస్టు 8, 9, 10 తేదీలలో మూడు రోజుల పాటు మహబూబ్ నగర్ ఫస్ట్ శిక్షణ కేంద్రంలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. నిష్ణాతులైన అధ్యాపకుల బృందం ఆధ్వర్యంలో బోధన పద్ధతులు, విద్యార్థుల మానసిక స్థితి అవగాహన, సబ్జెక్ట్‌పై పట్టు పెంపు, డిజిటల్ లెర్నింగ్ విధానాలు వంటి అంశాలపై విస్తృతంగా శిక్షణ అందిస్తున్నారు.

మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సమర్థవంతంగా కొనసాగుతోంది. వందేమాతరం ఫౌండేషన్ కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో మొదటి రోజు శిక్షణ తరగతులు సజావుగా జరిగాయి. వాలంటీర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన నైపుణ్యాలను అభ్యసిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడటమే కాకుండా పేద, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశాలు పెరుగుతాయని స్థానికులు, విద్యావేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, మహబూబ్ నగర్ ఫస్ట్ చేపడుతున్న ఈ వినూత్న కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలవనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొదటి రోజు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయ బృందం రజిత (SGT), హిమాబిందు,(SGT )సురేష్,(SGT )ముస్తాక్,(SA మ్యాథ్స్ ), శ్రీనయ్య (SA సోషల్), శ్రీకాంత్ (SA సోషల్), సుష్మిత (SA సైన్స్), , వెంకటయ్య(SA SOCIAL) , శ్రీనివాస్ (సైకాలజిస్ట్), ఫస్సియొద్దిన్(మ్యాథ్స్ ) తదితరులు ఉన్నారు.​

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>