కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు విషయంలో హాట్ టాపిక్‌గా మారిన మధుపార్క్ రిడ్జ్ (Madhu Park Ridge) అపార్ట్‌మెంట్ వాసులకు బిగ్ షాక్ తగిలింది. అపార్ట్‌మెంట్ ఖాళీ చేయాలని రాజేంద్రనగర్ ఆర్డీవో అందరికీ నోటీసులు జారీ చేశారు. మూసీ రివర్ ప్రాజెక్ట్ కోసం తక్షణమే అపార్ట్‌మెంట్ ఖాళీ చేయాలని నోటీసులలో పేర్కొన్నారు. అపార్ట్‌మెంట్‌వాసులు ఆర్డీవోను కలిసి ఈ విషయంపై చర్చించారు. తాము అపార్ట్‌మెంట్ ఖాళీ చేయాల్సిన అవసరం లేదని, మధుపార్క్ రిడ్జ్ లేకుండానే అభివృద్ధి చేస్తామని సీఎం బహిరంగ ప్రకటనలో తెలిపారని అధికారులకు వివరించారు. మళ్లీ ఎందుకు నోటీసులు పంపించారని ప్రశ్నించారు.
అలాగే ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, దీనిపై కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని అపార్ట్‌మెంట్ నివాసితులు పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మార్వోకు లీగల్ నోటీసులు కూడా పంపించారు. అలాగే తాము అపార్ట్‌మెంట్ ఖాళీ చేయాల్సి వస్తే తమకు ఇచ్చే పరిహారంపై స్పష్టత వచ్చాకే నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ఆర్డీవో పరిహారం పై ఇప్పుడే హామీ ఇవ్వలేమని చెప్పడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.

