కలం, ఖమ్మం బ్యూరో: “రోడ్డు వేస్తారా.. గర్భిణులను ఇలాగే మోసుకెళ్లమంటారా?” అంటూ భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పినపాక మండలం సుందరయ్య నగర్‌లో వలస గిరిజనులు భగ్గుమన్నారు. కనీసం అంబులెన్స్ కూడా రాలేని రీతిలో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఒక నిండు గర్భిణిని మంచంపై కూర్చోబెట్టి గ్రామ వీధుల్లో ఊరేగిస్తూ వినూత్న రీతిలో నిరసన (Tribal Protest) తెలిపారు.
గ్రామంలో సరైన రహదారి సదుపాయం లేకపోవడంతో నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు వాపోయారు. అత్యవసర వైద్య సేవలు కావాల్సిన సమయాల్లో వాహనాలు రాలేకపోవడంతో రోగులను, గర్భిణులను ఆసుపత్రికి తరలించడం నరకప్రాయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని, వచ్చిపోవడం తప్ప తమ సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి సుందరయ్య నగర్‌కు పక్కా రహదారి సదుపాయం కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

