కలం, తెలంగాణ బ్యూరో: ఈ నెల 13న కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) మీటింగ్ జరగనున్నది. ఎల్‌నినో ప్రభావం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మరింత తీవ్రం కానుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాల వినియోగంపై కేఆర్‌ఎంబీ త్రీమెన్ కమిటీ అత్యవసర భేటీ నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌లోని కేఆర్ఎంబీ ఆఫీసులో జరిగే ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రస్తుత నీటి అవసరాలు, రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నిల్వలు, రాబోయే రెండు నెలల నీటి వినియోగంపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రిజర్వాయర్లు పూర్తిగా నిండిన తర్వాతే సాగునీటి విడుదల అని తెలంగాణ నిర్ణయం తీసుకున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగు, తాగునీటి అవసరాలకు నీటి విడుదల కోరుతున్నది. దీంతో ఈ సమావేశం మరోసారి రెండు రాష్ట్రాల మధ్య నీటి లెక్కలకు వేదిక కానుంది.

