కలం, ఖమ్మం బ్యూరో: తనకు విడాకులు ఇవ్వాలంటూ వేధింపులకు గురిచేస్తున్న భర్త నుంచి న్యాయం కావాలంటూ ఓ మహిళ తన కూతురితో కలిసి రోడ్డెక్కింది. భద్రాచలం (Bhadrachalam) పట్టణంలోని ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ ‘బాలదుర్గ టాప్ ఇన్ టౌన్’ ఎదుట మహిళా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. బాధితురాలు విజయలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. సదరు వస్త్ర సంస్థలో వాటాదారుడైన బొప్పే కోటయ్యతో తనకు వివాహం జరిగిందని పేర్కొన్నారు. అయితే కొంతకాలంగా కోటయ్య ఇతర మహిళలతో సంబంధాలు కొనసాగిస్తూ, తనకు విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ వేధిస్తున్నాడని విజయలక్ష్మి, ఆమె కూతురు వెన్నెల ఆరోపించారు.
కొన్నేళ్లుగా కోటయ్య కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కోటయ్య తండ్రి తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కూడా వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని, వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని, భర్తతో కలిసి జీవించేలా చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి డిమాండ్ చేశారు. మహిళా సంఘాల సహకారంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ధర్నా అనంతరం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న కోటయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.

