కలం, భద్రాచలం : రాష్ట్ర విభజన సమయంలో అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని సిపిఐ (CPI) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా డిమాండ్ చేశారు. బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల మీదుగా సాగిన సీపీఐ ‘ప్రజా చైతన్య యాత్ర’ ముగింపు సభలో ఆయన మాట్లాడారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం తెలంగాణలో ఉండగా, ఆలయానికి చెందిన భూములు, ఆస్తులు ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం విరుద్ధమైన పరిస్థితి అని అన్నారు.
“రాముడు ఇక్కడ.. భూములు అక్కడ” అనే పరిస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంతో భద్రాద్రి (Bhadradri) జిల్లా భవిష్యత్తుకు ముప్పు పొంచి ఉందని సాబీర్ పాషా ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు శాస్త్రీయ ప్రమాణాలతో పటిష్టమైన కరకట్టలు నిర్మించాలని కోరారు. సీతారామ, సీతమ్మధార ప్రాజెక్టుల ద్వారా జిల్లాకు సాగునీరు అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకానికి వెంటనే నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇసుక లారీల రాకపోకల కారణంగా వాజేడు నుంచి భద్రాచలం వరకు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని ఆరోపించారు. తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న స్పెషాలిటీ వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని, గిరిజనులకు పోడు భూముల హక్కు పట్టాలు అందిస్తూ అటవీ హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సిపిఐ నేత ప్రభుత్వాన్ని కోరారు.

