కలం, మహబూబాబాద్: ప్రభుత్వ ఆసుపత్రిలో గడువు ముగిసిన సిరప్ ఇచ్చారంటూ ఆందోళన చేసిన ఘటన మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఇందిరానగర్ కాలనీకి చెందిన మురళీ తన నాలుగేళ్ల కుమారుడు ఎనోస్ రాజ్ అస్వస్థతకు గురి కావడంతో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాలుడిని పరీక్షించిన డాక్టర్లు రెండు సిరప్లు రాసిచ్చారు. అందులో ఒక సిరప్ ఆసుపత్రిలోనే ఇవ్వగా.. మరో సిరప్ బయట కొనుగోలు చేసుకోవాలని సిబ్బంది సూచించినట్లు మురళీ పేర్కొన్నారు.
అనంతరం ఇంటికి వెళ్లిన మురళీ.. బాలుడికి సిరప్ ఇచ్చేందుకు మందు బాటిల్ పరిశీలించగా, దాని గడువు జూన్ నెలలోనే ముగిసినట్లు గుర్తించారు. దీంతో తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి సిబ్బందిని ప్రశ్నించగా.. వాగ్వాదం జరిగింది. గడువు ముగిసిన సిరప్ ఇచ్చి పిల్లాడి ప్రాణాలతో చెలగాటమాడుతారా.. అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు.
విచారణ జరిపిస్తేనే..
మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. చిన్నారులకు మందులు అందించే సమయంలో వాటి తయారీ, గడువు తేదీలను పరిశీలించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై ఆసుపత్రి అధికారులు స్పందించి తప్పు ఎక్కడ జరిగిందో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజంగానే గడువు ముగిసిన సిరప్ ఇచ్చారా.. మందుల నిల్వలు, పంపిణీ ప్రక్రియలో ఎక్కడ లోపం జరిగింది? అనే అంశాలపై పరిశీలన చేపట్టాలని సూచిస్తున్నారు.

