కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ సర్కార్ కొత్త పెన్షన్ నిబంధనలను మార్పు చేయాలని , అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ శంకరపట్నం ( Shankarapatnam) బీజేపీ నేతలు శుక్ర వారం రోజున కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారి వద్ద ఆందోళన చేపట్టి బైఠాయించారు. కొత్త నిబంధన ప్రతులను దాహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి , మండల అధ్యక్షులు ఏనుగుల అనిల్ లు మాట్లాడుతూ.. ప్రత్యేకంగా 70 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం అత్యంత అన్యాయమైన నిర్ణయం అన్నారు.
57 సంవత్సరాల వయస్సు దాటిన ఎంతో మంది పేద వృద్ధులు పని చేయలేని పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని, అలాంటి వారిని పెన్షన్‌కు దూరం చేయడం సంక్షేమ ప్రభుత్వ లక్ష్యానికి విరుద్ధం అన్నారు. వృద్ధాప్య పెన్షన్ అర్హత వయస్సును 70 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే వితంతు మహిళలకు 40 సంవత్సరాల వయోపరిమితి విధించడం కూడా పూర్తిగా అన్యాయమని, భర్తను కోల్పోయిన మహిళ ఏ వయస్సులో ఉన్నా ఆర్థిక, సామాజిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని, అందువల్ల వితంతు పెన్షన్‌కు ఎలాంటి వయోపరిమితి లేకుండా అర్హులైన ప్రతి వితంతు మహిళకు పెన్షన్ అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన అర్హత నిబంధనలను కూడా పునఃసమీక్షించి, నిజమైన పేదలకు న్యాయం జరిగేలా తక్షణమే సవరణలు చేయాలని ఆయన బీజేపీ శంకరపట్నం మండల శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు కొమురయ్య, నాయకులు దొంగల రాములు, జంగ జైపాల్, కొయ్యడ అశోక్, దాసారపు నరేందర్, నిమ్మశెట్టి సంపత్, రాసమల్ల శ్రీనివాస్, కనకం సాగర్, ఎల్కపెల్లి సంపత్, మందాడి జగ్గారెడ్డి, కనకం కుమార్, పడాల వెంకటలక్ష్మి, లోకి కుమార్ ,చెర్ల శ్రీనివాస్, గూళ్ల రాజు, లక్ష్మి ,బోడ తిరుపతిరెడ్డి, రాజేందర్, వెంగళ ప్రవీణ్, మండల్ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

