కలం, స్పోర్ట్స్ : భారత క్రీడారంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి, పారిస్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచి చరిత్ర సృష్టించిన జావలిన్ హీరో నీరజ్ చోప్రా (Neeraj Chopra) వ్యాపారవేత్తగా కొత్త అవతారమెత్తారు. దేశంలో క్రీడలను రూట్ లెవెల్ నుంచి బలోపేతం చేసే లక్ష్యంతో నడుస్తున్న ‘యుబిఎస్ అథ్లెటిక్స్ కిడ్స్ కప్’లో ఆయన సహ యజమానిగా (కో-ఓనర్) చేరారు. గత రెండు సీజన్లుగా అంబాసిడర్‌గా సేవలు అందించిన చోప్రా, ఇప్పుడు నేరుగా పెట్టుబడిదారుడిగా మారడం గమనార్హం.
ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటికే 2,500కి పైగా స్కూళ్లలోని 2.5 లక్షల మంది చిన్నారులను ఆటల వైపు మళ్లించారు. దాదాపు 50 శాతం మంది బాలికలు ఇందులో పాల్గొనడం దీని ప్రత్యేకత. ప్రతిభ ఉన్న చిన్నారులకు సరైన వేదిక కల్పించడమే తమ ధ్యేయమని, కోటి మంది పిల్లలకు ఆటలను త్వరలోనే చేరువ చేస్తామని చోప్రా ధీమా వ్యక్తం చేశారు. క్రీడల్లో రాణించిన అగ్రశ్రేణి అథ్లెట్ ఇలాంటి బిజినెస్ మోడల్‌లో భాగస్వామి కావడం భారత్‌లో అత్యంత అరుదైన విషయమని నిర్వాహకులు కొనియాడారు. భవిష్యత్తులో దేశానికి మరిన్ని ఒలింపిక్ పతకాలు అందించే ఛాంపియన్లను తయారు చేయడంలో ఈ ఉమ్మడి భాగస్వామ్యం కీలక పాత్ర పోషించనుంది.

