కలం, స్పోర్ట్స్: ఇండియన్ ఫుట్‌బాల్ వర్గాల్లో సంచలనం నమోదైంది. భారత U15 ఫుట్‌బాల్ జట్టు మేనేజర్‌గా AIFF ఇచ్చిన పదవిని రంజిత్ బజాజ్ (Ranjit Bajaj) తిరస్కరించారు. ఆయన మినర్వా అకాడమీ అధినేత. బిబియానో ఫెర్నాండెజ్ హెడ్ కోచ్‌గా ఉన్న జట్టులో నియామక లేఖ వచ్చిన వెంటనే బజాజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రాస్ రూట్ ఫుట్‌బాల్‌పై బజాజ్‌కు మంచి పట్టుంది. AIFF వైఫల్యాలపై ఆయన ఎప్పుడూ గళం విప్పుతుంటారు. బిబియానో శైలికి, తన శైలికి పొంతన లేదని బజాజ్ స్పష్టం చేశారు. ఒకరిది కౌంటర్ ఎటాకింగ్ శైలి కాగా, మరొకరిది హై-ప్రెస్ శైలి అని చెప్పారు. ఈ రెండు భిన్నమైన వ్యూహాలు కుదరవని.. ఇద్దరినీ ఒకే చోట చేర్చడం విపత్తుకేనని హెచ్చరించారు.
చివరి నిమిషంలో మార్పులతో..
ఈ నిర్ణయం పట్ల తాను తీవ్ర అసంతృప్తిగా ఉన్నానని సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో రంజిత్ బజాజ్ చెప్పారు. తానొక విజేతనని, ప్రాసెస్ నమ్ముకుని గెలుస్తానని పేర్కొన్నారు. AIFFకి వేరే దారి లేకనే అతిపెద్ద విమర్శకుడైన తనకు పదవి ఇచ్చిందన్నారు. బిబియానోను ప్రోత్సహించాలనుకుంటే ఏడాది కిందటే పూర్తి జట్టును ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. చివరి నిమిషంలో మార్పులు చేయడం వల్ల ఉపయోగం లేదన్నారు. వివాదాలు పక్కనబెట్టి ప్రస్తుత కోచ్, జట్టుకు మద్దతు ఇవ్వాలని అభిమానులకు రంజిత్ బజాజ్ పిలుపునిచ్చారు.

