కలం, కరీంనగర్ బ్యూరో: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ (Karimnagar) లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ముందే ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందంటూ తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎలిగేటి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు.ప్రభుత్వ కార్యక్రమంలో వేదికపై స్థానాలు కల్పించే విషయంలో నిబంధనలు పాటించలేదని వారు ఆరోపించారు.
కరీంనగర్ (Karimnagar) జిల్లా పద్మశాలి సంఘం పదవీకాలం ముగిసి ఆరు సంవత్సరాలు గడిచినప్పటికీ, ఆ సంఘం మాజీ అధ్యక్షుడు మెతుకు సత్యంను ప్రస్తుత అధ్యక్షుడిగా పరిచయం చేసి వేదికపైకి ఆహ్వానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.అలాగే, ఇద్దరు మహిళా కార్పొరేటర్లకు బదులుగా వారి భర్తలను వేదికపై పిలిచారని అన్నారు. ఈ మేరకు తేల లక్ష్మికి బదులు తేల రమేష్‌ను, వేముల కవితకు బదులు వేముల చంద్రశేఖర్‌ను వేదికపైకి వేదికపై కూర్చోబెట్టడం కూడా ప్రభుత్వ ప్రోటోకాల్‌కు విరుద్ధమని పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధుల స్థానంలో ఇతరులను వేదికపైకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమం గౌరవానికి భంగం కలిగిందని విమర్శించారు.ఈ విషయంపై సహాయ సంచాలకుల (ఏడీ)ను ప్రశ్నించగా, “నేను ఎవరినీ వేదికపైకి పిలవలేదు. వారే వచ్చి వేదికపై కూర్చున్నారు” అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తెలియజేశారు. ప్రభుత్వం నిర్వహించే వేదిక పైన ఎవరైనా వచ్చి కూర్చోవచ్చని, ప్రోటోకాల్‌కు సంబంధం లేదన్నట్టు మాట్లాడినట్లు విమర్శించారు.
అయితే ప్రభుత్వ కార్యక్రమంలో వేదిక నిర్వహణ, ప్రోటోకాల్ అమలు బాధ్యత అధికారులదే అయినప్పుడు, అనుమతి లేకుండా వ్యక్తులు వేదికపైకి ఎలా వచ్చి కూర్చోగలిగారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివరణ మరిన్ని సందేహాలకు తావిస్తోందని చేనేత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చేనేత కార్మికుల కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో అర్హత కలిగిన ప్రజాప్రతినిధులు, అధికారిక గుర్తింపు ఉన్న సంఘాల ప్రతినిధులకు మాత్రమే అవకాశం కల్పించాలని వారు కోరారు.ఈ అంశంపై జిల్లా కలెక్టర్ స్పందించి, ప్రోటోకాల్ ఉల్లంఘన ఎలా జరిగిందో ప్రజలకు, పద్మశాలి సమాజానికి వివరణ ఇవ్వాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
Also Read : బస్సు తుస్సు.. మొరాయిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు, ప్రయాణికులకు చుక్కలే!
Follow Us On : WhatsApp

