కలం, మునుగోడు: వ్యవసాయం తర్వాత అత్యంత కీలకమైన చేనేత రంగాన్ని, దానిపై ఆధారపడి జీవిస్తున్న నేతన్నలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మునుగోడు (Munugode) ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Raj Gopal Reddy) అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చండూరు మున్సిపాలిటీలో చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చేనేత కళాకారుల ఆత్మీయ సమ్మేళనం’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా తెలంగాణ సిద్ధాంతకర్త, స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధునిక యంత్రాల రాకతో చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న నేతన్నలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన (MLA Raj Gopal Reddy) హామీ ఇచ్చారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు పెన్షన్లు, కొత్త రుణాల మంజూరు, అర్హులందరికీ జియో ట్యాగ్స్ కల్పించడం, ఆప్కో ద్వారా చేనేత వస్త్రాల విక్రయాలను పెంచడం వంటి అంశాలపై చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని అన్నారు. చేనేత రంగ సమస్యలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. 2009లోనే చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి గట్టుప్పల్(Gattuppal)లో ఓ నేతన్న కుటుంబానికి సహాయం అందించానని, హైదరాబాద్‌లో చేనేత కార్మికులతో సమావేశం నిర్వహించి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వారా సహకార సంఘాల రుణమాఫీకి కృషి చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
గత ప్రభుత్వం చేనేత సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన ఎమ్మెల్యే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించిందని పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను స్మరించుకుంటూ.. “నేటి రాజకీయాలలో అలాంటి వ్యక్తులు అరుదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఇచ్చిన సూచనలు ఎంతో విలువైనవి” అని కొనియాడారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాతినిధ్యం వహించిన చిన్న కొండూరు (ప్రస్తుత మునుగోడు) నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఎమ్మెల్యే పదవి కిరీటం కాదని, ఐదేళ్ల పాటు ప్రజలకు సేవ చేసే బాధ్యత అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం మిగిల్చిన అప్పుల భారాన్ని అధిగమిస్తూ ప్రజా ప్రభుత్వం హామీల అమలుకు కృషి చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘాల నాయకులు, చేనేత కళాకారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Also Read : మమ్మల్ని క్రిమినల్ వేస్ట్ అంటారా?.. విద్యార్థినుల ఆందోళన
Follow Us On : WhatsApp

