కలం, చండూరు: నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా హైదరాబాదులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ కోర్సులో పబ్లిక్ రిలేషన్స్ సబ్జెక్టులో నల్లగొండ (Nalgonda) జిల్లా, చండూరు (Chandur) మండలం, నేర్మట గ్రామానికి చెందిన బొమ్మర గోని జగన్ (Bommaragoni Jagan) అత్యధిక మార్కులు సాధించాడు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా మెరిటోరియస్ స్టూడెంట్ రికగ్నిషన్, అవార్డు ప్రధానం చేశారు.
గురువారం పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, సీవిఎన్ పబ్లిక్ రిలేషన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లక్డికాపూల్ లోని ఎఫ్టీ సీసీఐ భవనంలో మెరిటోరియస్ స్టూడెంట్ రికగ్నిషన్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఈ విజయానికి నాకు తొలిమెట్టు నా తల్లిదండ్రులు, నా గురువులని కొనియాడారు.
సమాజంలో జరుగుతున్న అవినీతిని రూపుమాపడం కోసం ఎన్నో వాస్తవాలను వెలికి తీసి పత్రికల ద్వారా సమాజానికి తెలియజేయడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. మానవసేవే మాధవ సేవ అని, నిత్యం ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ వంతు పాత్ర నిర్వహిస్తామన్నారు. తన విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు, ఆధ్యాపకులకు, స్నేహితులకు అలాగే సురవరం తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

