కలం, వెబ్ డెస్క్ : కష్టపడి తీసిన కల్లును దొంగలు ఎత్తుకెళ్తుండటంతో ఓ గీత కార్మికుడు వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా తాటిచెట్టుకే సీసీ కెమెరా బిగించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు (Mothkur) చెందిన అన్నెపు శ్రవణ్ గౌడ్ గీత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజూ చెట్టుపై కల్లు కుండలు కట్టి రాగా, రాత్రివేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఆ కల్లును దొంగిలించేవారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనతో ఆయన సోలార్ ఆధారిత సీసీ కెమెరాను కొనుగోలు చేశాడు. నేరుగా తాటిచెట్టుపై కల్లు కుండలు ఉండే చోట ఆ కెమెరాను అమర్చాడు. ఫోన్‌కు అనుసంధానించి రాత్రివేళల్లో చెట్టు వద్ద ఏం జరుగుతోందో నిఘా పెట్టాడు. తాటిచెట్టుపై సీసీ కెమెరాను చూసిన స్థానికులు ఆయన ఉపాయాన్ని అభినందిస్తున్నారు.

