కలం, ఖమ్మం బ్యూరో: కురుస్తున్న వాన.. తడుస్తున్న కాలనీ బాటలు.. అయినా ఆ ప్రజా సంకల్పం వెనకడుగు వేయలేదు. చేతిలో గొడుగు పట్టుకుని, నడివీధి టీ కొట్టు వద్ద నలుగురిలో ఒకడై సామాన్యుడిలా ముచ్చటిస్తున్న దృశ్యాలు ఖమ్మం (Khammam) జిల్లా ఏదులాపురం (Yedulapuram) మున్సిపాలిటీ పరిధిలో పర్యటన ముఖచిత్రాన్ని మార్చివేశాయి.
తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) శుక్రవారం ఉదయం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజాక్షేత్రంలో పర్యటించి, ప్రజల మధ్యలో నిలబడి భరోసానిచ్చారు. జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్తో కలిసి మున్సిపాలిటీ పరిధిలోని 22, 23వ వార్డులైన సాయిగణేష్ నగర్, ఇందిరమ్మ కాలనీల్లో మంత్రి నిర్వహించిన ఈ క్షేత్రస్థాయి పర్యటన పాలనకు ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది.
పర్యటన సాగుతుండగా సాయిగణేష్ నగర్ వీధిలోని ఒక చిన్న టీ కొట్టు వద్ద ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా మంత్రి ఆగారు. సామాన్య పౌరుడిలా అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చుని స్థానికులతో కలిసి వేడివేడి టీ తాగారు. తాగునీటి తిప్పలు, వర్షపు నీటి ఇబ్బందులు, కరెంట్ తీగల భయాలను ప్రజలు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ‘నేనున్నాను’ అంటూ ఆయన ఆప్యాయంగా ధైర్యం చెప్పారు. తమ నేత తమ పక్కనే కూర్చుని కష్టసుఖాలు వినడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఏదులాపురం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు మంజూరు చేశారని మంత్రి ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వర్షపు నీరు నిలిచే లోతట్టు ప్రాంతాల్లో శాశ్వత డ్రైనేజీల నిర్మాణం, తుమ్మ చెట్ల తొలగింపు, తాగునీటి సరఫరా మెరుగుదల వంటి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడతామని హామీ ఇచ్చారు.
ఇందిరమ్మ ఇళ్లు, స్థలాల కోసం ప్రజలు సమర్పించిన వినతులను ప్రభుత్వం అత్యంత సానుకూలంగా పరిశీలిస్తుందని మంత్రి పునరుద్ఘాటించారు. మున్సిపాలిటీలో కొనసాగుతున్న పార్కుల అభివృద్ధి పనులను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని, అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో ఉంటూ పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, విద్యుత్, హౌసింగ్ శాఖల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

