దేశంలో అతిపెద్ద కుటీర పరిశ్రమ చేనేత: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: భారతీయ జనతా పార్టీ దృష్టిలో భారతీయ చేనేత రంగం కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని.. భారతీయ ఆత్మకు ప్రతిరూపం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) తెలిపారు. ఆ ప్రతిరూపానికి ఆచరణగా ‘లోకల్ ఫర్ వోకల్’ అనే నినాదంతో భారత చేనేత రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత కార్మికులందరికీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

నేతన్న కూడా అంతే ముఖ్యం..

ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎంత ముఖ్యమో కట్టుబట్టను అందిస్తున్న నేతన్న కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే శతాబ్దాల సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతిబింబం నేతన్న అని కొనియాడారు. భారతీయ చరిత్ర, సంస్కృతి, కళాత్మకకు ప్రతిరూపం చేనేత అని పేర్కొన్నారు. తనకు తెలిసినంత వరకు దేశంలో వ్యవసాయం తరువాత రెండో అతిపెద్ద కుటీర పరిశ్రమ ఏదైనా ఉందంటే అది చేనేత రంగంమాత్రమేనని స్పష్టం చేశారు.

ఇంతటి విశిష్టత, గొప్ప చరిత్ర ఉన్న చేనేత రంగాన్ని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించిన మహానాయకుడు, ప్రధాని నరేంద్రమోదీ అని కొనియాడారు. విదేశీ దుస్తులను బహిష్కరిస్తూ స్వదేశీ వస్తువులను మాత్రమే ధరించాలంటూ మహాత్మా గాంధీ 1905 ఆగస్టు 7న ‘‘విదేశీ వస్త్ర బహిష్కరణ – స్వదేశీ ఉత్పత్తుల పునరుద్ధరణ’’ ఉద్యమ స్పూర్తితో చేనేత రంగానికి చేయూత ఇవ్వాలనే గొప్ప ఆశయంతో మోదీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించారని తెలిపారు.

బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

“దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది ఈ చేనేత రంగాన్ని (Handloom Industry) నమ్ముకుని బతుకుతున్నారని బండి సంజయ్ తెలిపారు. ఇంత గొప్ప చేనేత రంగం గురించి చెప్పాలంటే.. నాకు ఒకవైపు ఆనందం కలుగుతోంది. ఇంకోవైపు బాధేస్తోంది. ఆనందం ఏమిటంటే. ఈ దేశంలో చేనేత అంటేనే మన తెలంగాణ, మన సిరిసిల్ల, మన ఉమ్మడి కరీంనగర్ అగ్రభాగాన నిలుస్తోంది. ఇంకా అదృష్టం ఏమిటంటే.. అగ్గిపెట్టేలో చీర ఇమిడేలా రకరకాల రంగులతో తయారు చేసిన నల్ల పరంధాములు, నల్ల విజయ్ కుమార్ మన ఉమ్మడి కరీంనగర్ వారసత్వ సంపద కావడం మనందరికీ గర్వకారణం. అంతేకాదు రెండు గంటల 50 నిమిషాల్లో ఏకబిగిన అగ్గిపెట్టెలో ఇమిడే విధంగా మగ్గం పైన చీర తయారీ తయారు చేసి ప్రపంచ రికార్డు సాధించిన మన వెల్ది హరిప్రసాద్ మన సిరిసిల్ల నేతన్న కావడం గల్లా ఎగరేసుకునేంతటి గర్వకారణం.

దురదృష్టం ఏమిటంటే… సరైన స్థాయిలో ఉపాధి లేక అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కార్మికుల్లో ఎక్కువ మంది మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులే కావడం నన్ను నిరంతరం కలిచి వేస్తోంది. మువ్వన్నెల జెండా నేసిన చేనేతకు నేడు చేయూత కరువైంది.

ఇవన్నీ గమనించిన తరువాతే ప్రధాని మోదీ…చేనేత రంగాన్ని “వోకల్ ఫర్ లోకల్”, “మేక్ ఇన్ ఇండియా” ఉద్యమాలతో అనుసంధానం చేసి దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (NHDP) ద్వారా క్లస్టర్ అభివృద్ధి, ఆధునిక మగ్గాలు, డిజైన్, మార్కెటింగ్, నైపుణ్య శిక్షణకు కేంద్రం సహాయం అందిస్తున్నారు. రా మెటీరియల్ సప్లై స్కీమ్ ద్వారా పత్తి, పట్టు, ఉన్ని నూలును సబ్సిడీతో అందిస్తూ చేనేత కార్మికుల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించారు.

హ్యాండ్లూమ్ మార్క్, ఇండియా హ్యాండ్‌మేడ్ ప్రచారం పేరిట దేశవ్యాప్తంగా ఎక్స్‌పోలు నిర్వహించి మార్కెట్ అవకాశాలను విస్తరించారు. సమర్థ్ (SAMARTH) ద్వారా చేనేత, వస్త్ర రంగంలో యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. చేనేత రంగంలో ప్రతిభ కనబరిచిన కార్మికులకు సంత్ కబీర్ అవార్డులు, జాతీయ చేనేత అవార్డులు అందిస్తూ గౌరవిస్తున్నారు. ఈ ఏడాది (2026లో) హ్యాండ్లూమ్ హ్యాకథాన్ ప్రారంభించి సాంకేతికత, డిజిటల్ ఆవిష్కరణలను చేనేత రంగంతో అనుసంధానించారు.

హ్యాండ్లూమ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేసి చేనేత కార్మికుల వార్షిక ఆదాయాన్ని 5 నుండి 6 లక్షల రూపాయలకుకు పెంచే లక్ష్యాన్ని ప్రకటించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో (2026-27) జాతీయ హ్యాండ్లూమ్ & హ్యాండీక్రాఫ్ట్స్ ప్రోగ్రామ్, మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ ఇనిషియేటివ్, నేషనల్ ఫైబర్ మిషన్, టెక్స్-ఈకో ఇనిషియేటివ్ వంటి కొత్త కార్యక్రమాలను ప్రకటించారు.

భారతీయ జనతా పార్టీ ద్రుష్టిలో ‘‘భారతీయ చేనేత రంగం కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు. భారతీయ ఆత్మకు ప్రతిరూపం. ఆ ప్రతిరూపానికి ఆచరణగా ‘లోకల్ ఫర్ వోకల్’ అనే నినాదంతో భారత చేనేత రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నంలో మీరంతా భాగస్వాములు కావాలని కోరుతున్నా.” అని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>